ఆటిజం ఉన్న పిల్లల్లో ఇంద్రియ స్పందన విధానం భిన్నంగా ఉంటుందని చెబుతూ శిశువుల్లో కంటి సంబంధం, స్పందన, పరస్పర చర్యలలో మార్పులను గమనించడం ద్వారా తల్లిదండ్రులు తొందరగా ఆటిజాన్ని గుర్తించవచ్చని మెదడు, వెన్నెముక శస్త్ర వైద్య నిపుణుడు డా. టి. కృష్ణమూర్తి చెప్పారు. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా `మానస’ చిన్నారుల ఆరోగ్య, వైకల్యాల అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో “ఆటిజంలో ముందస్తు గుర్తింపు, జోక్యం – జీవిత మార్గాలను మార్చే దిశగా” అనే అంశంపై జరిగిన సెమినార్లో ప్రసంగించారు.
తల్లిదండ్రుల ద్వారా గుర్తింపు, పిల్లల వైద్యుల ద్వారా నిర్ధారణ, ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా జోక్యం సమన్వయంతో జరగాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ఇంటి వద్ద తల్లిదండ్రుల సహకారంతో చికిత్స కొనసాగించడం ఎంత ముఖ్యమో పేర్కొంటూ పిల్లల జీవన నాణ్యత మెరుగుపడటంలో తల్లిదండ్రులు, వైద్యులు, శిక్షణ నిపుణుల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
పిల్లల అభివృద్ధి వైద్య నిపుణురాలు డా. ఏ. విష్ణు ప్రియా మాట్లాడుతూ, పిల్లల నేర్చుకునే విధానానికి అనుగుణంగా బోధన మారాలని సూచించారు. “పిల్లలు మనం బోధించే విధంగా నేర్చుకోలేకపోతే, వారు నేర్చుకునే విధంగా మనం బోధించాలి” అని ఆమె తెలిపారు. ఆటిజం ఉన్న వారికి అందుబాటులో ఉండే పాఠశాలలు, వారి వైవిధ్య ఇంద్రియ సామర్ధ్యాలను అనుకూలమైన బహిరంగ ప్రదేశాలు ఉండాలని ఆమె పేర్కొన్నారు.
ఆటిజం ఉన్న పిల్లల్లో కూడా నేర్చుకునే సామర్థ్యం, కుటుంబంతో భాగస్వామ్యం, ఆటలలో పాల్గొనే నైపుణ్యం, శారీరక, ఇంద్రియ దృఢత్వం, స్నేహ సంబంధాలు ఏర్పరచుకునే సామర్థ్యం మొదలగు సామర్థ్యాలు మెరుగుపరిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆమె వివరించారు. తల్లిదండ్రులు “ఆందోళన నుండి అవగాహనకు, అవగాహన నుండి కార్యాచరణకు” మారాలని ఆమె పిలుపునిచ్చారు. 3 నుండి 7 సంవత్సరాల పిల్లల కోసం పాఠశాల సిద్ధత కార్యక్రమాలు ఎంతో ముఖ్యమని, కూర్చునే సామర్థ్యం, సంభాషణ, సూచనలు అనుసరించే నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని ఆమె సూచించారు.
విద్యా సలహాదారు ఆర్. బృజానంద్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి పిల్లవాడికి సాధారణ పాఠశాలలో చదివే హక్కు ఉందని తెలిపారు. తన అనుభవాన్ని పంచుకుంటూ, ఆటిజం ఉన్న పిల్లలను తరగతుల్లో చేర్చినప్పుడు ఇతర విద్యార్థులు వారిని అంగీకరించి, వారి అభ్యాసాన్ని మెరుగుపరచడంలో సహకరించారని చెప్పారు. ఆటిజం ఉన్న పిల్లలను వేరుగా కాకుండా సమగ్ర వాతావరణంలో భాగం చేయడం అత్యవసరం అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు, ప్రత్యేక ఉపాధ్యాయులు, ప్రత్యేక విద్యార్థులు తల్లిదండ్రులు, చికిత్స నిపుణులు పాల్గొని ఆటిజం పై అవగాహన, ముందస్తు జోక్యం అవసరంపై చర్చించారు.

More Stories
మూసీ ప్రాజెక్టుపై ఎన్జీటీలో ప్రభుత్వానికి ఊరట
దండుగమారి వ్యవహారంగా మారిన ‘ఇందిరమ్మ క్యాంటీన్లు’
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలూ మిలాఖత్