అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు లోక్సభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. వైసీపీ మినహా మిగిలిన పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. అమరావతి బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం- 2014లోని సెక్షన్ 5(2)కి సవరణ చేస్తూ కేంద్ర హోం శాఖ రూపొందించిన బిల్లును ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో ప్రవేశపెట్టారు.
సుమారు 2 గంటలపాటు చర్చ తర్వాత అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, సమాజ్వాదీ సహా పలు పార్టీల ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. అనంతరం బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ పోస్ట్ ఫ్యాక్టో ర్యాటిఫికేషన్ చేసి అనంతరం రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ఏపీ విభజన ప్రక్రియ అరాచకంగా జరిగిందని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. పార్లమెంటులో లైట్లు, కెమెరాలు ఆపి బిల్లు పాస్ చేశారని ఆమె గుర్తు చేశారు. చట్టాన్ని గౌరవించి రాష్ట్ర విభజనను ఏపీ ప్రజలు అంగీకరించారని, విభజన ఆగ్రహం నుంచి రాజధాని అమరావతి పుట్టిందని ఆమె తెలిపారు. 29 వేలమంది రైతులు అమరావతి కోసం భూములిచ్చారని గుర్తుచేశారు.
వైఎస్సార్సీపీ వచ్చాక అమరావతి భవితవ్యం అంధకారంలో పడిందని, వికేంద్రీకరణ పేరుతో జగన్ మూడు రాజధానులన్నారని ఆమె ధ్వజమెత్తారు. అమరావతి కోసం రైతులు, మహిళలు పోరాడారని పేర్కొంటూ ఈ బిల్లుతో ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపై రాజధాని మార్చాలంటే పార్లమెంటు అనుమతి తప్పనిసరి అని చెబుతూ అమరావతి కోసం కేంద్రం నిధులు అందిస్తోందని ఆమె స్పష్టం చేశారు.
అమరావతికి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతునిస్తుందని ఆ పార్టీ ఎంపీ మాణికం ఠాగూర్ తెలిపారు. రాజధాని అమరావతికి కేంద్రం సంపూర్ణంగా సహకరించాలని కోరారు. రాజధాని అమరావతికి తగినన్ని నిధులు అందించాలని, ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించాలని కోరారు. విశాఖ ఉక్కును కేంద్రం ఆదుకోవాని, విశాఖలో ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధికి సహకరించాలని మాణికం ఠాగూర్ కోరారు.
ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుందా అన్న అనుమానానికి ఈ చట్టసవరణ ముగింపు పలుకుతుందని బిల్లుపై చర్చలో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులకు అభినందనలు తెలిపారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయాలని, పోరాడిన మహిళలకు జేజేలు తెలిపారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ వల్లభనేని బాలశౌరి లోక్సభలో ప్రకటించారు.
దేశం మొత్తం రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు మద్దతు తెలిపితే వైఎస్సార్సీపీ మాత్రం వ్యతిరేకించడం దురదృష్టకరమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. అమరావతి చట్టబద్ధత చట్టంతో ఆంధ్రప్రదేశ్లో ఇక మూడు ముక్కలాటలు సాగబోవని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉద్ఘాటించారు.

More Stories
దండుగమారి వ్యవహారంగా మారిన ‘ఇందిరమ్మ క్యాంటీన్లు’
చైనా సీసీటీవీ కెమెరాలపై భారత్ లో నిషేధం!
సోషల్ మీడియాపై పోలీసుల నిఘా.. నేరుగా కేంద్రమే నోటీసులు!