ఇరాన్‌ దాడిలో ఈ-3 సెంటిన్రీ విమానం ధ్వంసం

ఇరాన్‌ దాడిలో ఈ-3 సెంటిన్రీ విమానం ధ్వంసం

ఇరాన్‌ యుద్ధంలో అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది.  సౌదీ అరేబియాలోని ఒక వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన దాడిలో, అమెరికాకు చెందిన  300 మిలియన్ డాలర్ల విలువైన ఒక కీలకమైన ముందస్తు హెచ్చరిక, నియంత్రణ విమానం ఈ-3 సెంటిన్రీ ధ్వంసమైంది. అమెరికాకు చెందిన ప్రధానమైన యూఎస్‌ అవాక్స్‌ విమానం రెండు ముక్కలైనట్టు ఇరాన్‌ ప్రకటించింది. 

అలాగే ఇంధనం కోసం ఉన్న మరో విమానం కూడా ఈ దాడిలో దెబ్బతింది. ధ్వంసమైన అవాక్స్‌ విమానం ధర 700 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 6,623 కోట్లు) అని, తాము ప్రిన్స్‌ సుల్తాన్‌ ఎయిర్‌ బేస్‌ లక్ష్యంగా దాడి చేసినప్పుడు అక్కడ ఈ-3 ఏడబ్ల్యూసీఎస్‌ విమానం నిలిపి ఉందని తెలిపింది. తమ దాడిలో ఆ విమానం రెండు ముక్కలైందని పేర్కొంటూ దానికి సంబంధించిన చిత్రాలను ఇరాన్‌ ప్రెస్‌ టీవీ విడుదల చేసింది. కాగా, 29 డ్రోన్లు, ఆరు బాలిస్టిక్‌ క్షిపణులతో జరిపిన ఈ దాడిలో యూఎస్‌కు చెందిన 10 మంది గాయపడ్డారు.

ఈ-3 సెంటిన్రీ అనేది బోయింగ్ అభివృద్ధి చేసిన అమెరికన్ వైమానిక ముందస్తు హెచ్చరిక, నియంత్రణ విమానం. ఈ-3 సెంటిన్రీ విమానాలను సాధారణంగా ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. మరోవైపు ఈ విమానం పై భాగంలో తిరిగే రాడార్ డిస్క్ ఉంటుంది. శత్రువు ముప్పును గుర్తించేందుకు, ఇతర యుద్ధ విమానాలకు మార్గనిర్దేశం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. 

ఈ విమానం యుద్ధ సమయంలో కీలకంగా వ్యవహరిస్తుంది. సరిహద్దులకు చాలా దూరంలో ఉన్న వైమానిక శత్రు బలగాలను గుర్తిస్తుంది. వాటి ఉనికిని పసిగడుతుంది. దీంతో ఫైటర్, ఇంటర్‌సెప్టర్ యుద్ధ విమానాలను శత్రు లక్ష్యాల వైపు మళ్లించేందుకు సహకరిస్తుంది.

కాగా, అమెరికా విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ కనుక తమ పరిధిలోకి వస్తే దానిని లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తామని ఇరాన్‌ నావికా దళం హెచ్చరించింది. ప్రస్తుతం గల్ఫ్‌ రీజియన్‌లో ఉన్న ఈ నౌక ఇరాన్‌తో యుద్ధంలో ప్రధాన విమాన వాహక నౌకగా వ్యవహరిస్తున్నది. ‘అబ్రహం లింకన్‌ ఎప్పుడైతే తమ ఫైరింగ్‌ రేంజిలోకి వస్తుందో అప్పుడు సముద్రం నుంచి సముద్రంలోకి ప్రయోగించే క్షిపణుల ద్వారా దేనా నౌకలోని అమరవీరుల రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాం’ అని ఇరాన్‌ నేవీ చీఫ్‌ షహ్మ్‌ ఇరానీ పేర్కొన్నారు.

ఇరాన్‌ యూనివర్సిటీపై ఇజ్రాయెల్‌ దాడి

టెహ్రాన్‌లో ఉన్న ఇరాన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐయూఎస్‌టీ)పై శుక్రవారం ఇజ్రాయెల్‌ దాడి చేసింది. కాగా, అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం యూనివర్సిటీలు పౌర సంస్థలు కాబట్టి వాటిపై ఎట్టి పరిస్థితుల్లో దాడిచేయరాదు. ఈ దాడిని అమెరికా సోమవారం మధ్యాహ్నం 12 గంటల్లోగా ఖండించాలని, లేకపోతే, పశ్చిమాసియాలో ఉన్న అమెరికన్‌, ఇజ్రాయెల్‌ యూనివర్సిటీ ప్రాంగణాలన్నింటిపై దాడి చేస్తామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. 

ఆ రోజు అమెరికన్‌ యూనివర్సిటీల ఉద్యోగులు, ప్రొఫెసర్లు, విద్యార్ధులు కనీసం ఒక కిలోమీటర్‌ దూరంలో ఉండాలని సూచించింది. ఇస్ఫాన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, ఒక రిసెర్చి సెంటర్‌ సహా 600 పాఠశాలలపై దాడులు జరిగాయని ఇరాన్‌ మీడియా వెల్లడించింది.

ఇజ్రాయెల్‌ కెమికల్‌ ప్లాంట్‌పై దాడులు

ఇజ్రాయెల్‌లోని ఓ కెమికల్‌ ప్లాంట్‌ను ఇరాన్‌ పేల్చేసింది. దీంతో ఆ రసాయన కర్మాగారం నుంచి విషపూరిత వాయువులు పెద్ద ఎత్తున లీక్‌ అయ్యాయి. భారీగా వెలువడిన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో భీతావహ పరిస్థితి నెలకొన్నది. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? ప్రాణాలు కోల్పోయారా? అన్న వివరాలు బయటకు రాలేదు. సమీపంలోని పౌరులెవ్వరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం హెచ్చరిక జారీచేసింది. హొవావ్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలోని ఓ రసాయన కర్మాగారంపై ఇరాన్‌ డ్రోన్‌ దాడులు జరిపింది. ఈ కెమికల్‌ ప్లాంట్‌ చైనాకు చెందిన సింజెంటా గ్రూప్‌నకు చెందిన ‘అడామా’ కంపెనీది. దీంట్లో పంట సంరక్షణ ఉత్పత్తులను తయారుచేస్తారు.