వీవీఐపీల విమానాలకు కొత్త నియమావళి

వీవీఐపీల విమానాలకు కొత్త నియమావళి

* దేశంలో సగం విమానాల్లో సాంకేతిక లోపాలు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌, మరో నలుగురు ప్రయాణిస్తున్న చిన్న విమానం ప్రమాదానికి గురి కావడంతో అందరూ మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పౌరవిమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ )కేంద్ర, రాష్ర్టాలకు చెందిన ప్రముఖులు (వీవీఐపీలు) ప్రయాణించే ప్రత్యేక, నాన్‌ షెడ్యూల్‌ విమానాలకు సంబంధించి శుక్రవారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 

“భద్రతపై ప్రభావం చూపే విధంగా ప్రయాణం చేపట్టేందుకు విమాన సిబ్బందిపై అనవసరమైన ఒత్తిడి తీసుకురాకూడదు. వీఐపీల అవసరాల కారణంగా విమాన ప్రయాణంలో చివరి నిమిషంలో చేసే మార్పులు ఏమైనా ఉంటే అవి సంస్థ యాజమాన్యం ద్వారా మాత్రమే సమన్వయం చేసుకోవాలి తప్ప సిబ్బందితో నేరుగా కాదు” అని కొత్త నిబంధనలు పేర్కొన్నాయి.

ఈ కొత్త నిబంధనలు వీఐపీలు ఇష్టానుసారంగా ఇచ్చే ఆదేశాలకు ‘నో’ చెప్పడానికి వీలు కల్పిస్తున్నాయని ఒక చార్టర్‌ ఆపరేటర్‌ తెలిపారు. వాతావరణం, ఇతర సమస్యల కారణంగా విమానం బయలుదేరడం సాధ్యం కాదని చెప్పినా, వీఐపీల బలవంతం కారణంగా వెళ్లి ఇబ్బందులు, ప్రమాదాల్లో పడిన ఘటనలు తాను ఎదుర్కొన్నానని ఆయన వెల్లడించారు.   కాగా, జడ్‌ ప్లస్‌, ఎస్‌పీజీ కింద రక్షణ పొందుతున్న వారు, సీజేఐ, సీఎంలు, గవర్నర్లు తదితరులు వీవీఐపీ క్యాటగిరీకి వస్తారు.

ఇలా ఉండగా, దేశంలోని 50 శాతం వాణిజ్య విమానాల్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని స్టాండింగ్‌ కమిటీ ఆన్‌ సివిల్‌ ఏవియేషన్‌ వెల్లడించింది.  గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఏడాది కాలంగా 754 విమానాల్లో తనిఖీలు చేపట్టగా 377 విమానాల్లో లోపాలు ఉన్నట్టు గుర్తించారు. ఆడిట్‌ చేసిన వాటిలో ఇండిగో విమానాల సంఖ్య ఎక్కువని, లోపాలు కూడా అందులోనే ఎక్కువగా కన్పించాయని కమిటీ పేర్కొంది.

ఫిబ్రవరి 3 వరకు 405 విమానాల్లో తనిఖీ చేపట్టగా 148 విమానాల్లో లోపాలు ఉన్నాయి. అలాగే 166 ఎయిరిండియా, 101 ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలను ఆడిట్‌ చేశారు. ఈ రెండు సంస్థలకు చెందిన వాటిలో సగం లోపాలతో ఉన్నాయని కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం అనంతరం ఎయిరిండియాపై డీజీసీఏ నిర్వహించిన తనిఖీని కూడా ఈ నివేదిక ప్రస్తావించింది. 

ఆ ఆడిట్‌లో దాదాపు 100 భద్రతా లోపాలను గుర్తించారు. అందులో ఏడు ఉల్లంఘనలు లెవల్‌-1 స్థాయికి సంబంధించినవని, వాటిని సరిచూసుకోవాలని ఎయిరిండియాకు డీజీసీఏ సూచించింది. విమానయాన రంగంలో సిబ్బంది కొరతను కమిటీ ప్రస్తావించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగాన్ని డీజీసీఏ పర్యవేక్షించే సామర్థ్యంపైనా కమిటీ అనుమానాలు వ్యక్తం చేసింది.