ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో అమరావతికి చట్టబద్దత కల్పించేందుకు వీలుగా ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్-5ను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయాలని నిర్ణయించారు. దీనికోసమే శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించిన రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖమంత్రి కొలుసు పార్ధసారధి విభజన చట్టం సెక్షన్-5లోని సబ్ సెక్షన్-(2)లో అమరావతి వద్ద అనే పదాన్ని చేర్చాలని, సెక్షన్-5 వివరణకు అమరావతి అనగా ఎపి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఎపి సిఆర్డిఎ)చట్టం-2014 కింద నోటిఫై చేసిన రాజధాని నగర ప్రాంతాలు కలిసి ఉంటాయి’ అనే పదాలను చేర్చాలని నిర్ణయించినట్లు చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు భూమి, కాలనీల రూపంలో పునరావాసం కల్పించేందుకు రంపచోడవరం డివిజన్, పోలవరం జిల్లాలోని గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో గుర్తించిన భూములకు భూసేకరణ చట్టం-2013లోని సెక్షన్లు 26 నుంచి 30, ఫస్డ్ షెడ్యూల్ ప్రకారం ఎకరాకు రు.12.50 లక్షలు చెల్లించనున్నట్లు చెప్పారు. దీనికోసం 4520.52 ఎకరాల సేకరించాల్సి ఉంటుందని, మొత్తం రూ.565.06కోట్లు అవసరమవుతాయని అంచనా వేశామని తెలిపారు.
రాష్ట్రంలో ప్రైవేట్ కోచింగ్ సంస్థల నియంత్రణ, రిజిస్ట్రేషన్, పర్యవేక్షణ కోసం ‘ది ఆంధ్రప్రదేశ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్(రెగ్యులేషన్ అండ్ కంట్రోల్) రూల్స్-2026 ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఆమోదం తెలిపామన్నారు. ఈ నిబంధనల ప్రకారం అన్ని కోచింగ్ సెంటర్లు రిజిస్ట్రేషన్ తప్పనసరి చేసుకోవాలని వెల్లడించారు. దీపం-2 పథకం కింద ఎల్పిజి కనెక్షన్ లబ్ధిదారులకు అందుతున్న విధంగానే ఇక నుంచి పిఎన్జి కనెక్షన్ వినియోగదారులకు కూడా సమానమైన సబ్సిడీని వర్తింపచేస్తామన్నారు.
హైకోర్టు ప్రతిపాదించిన విధంగా 96 కొత్త కోర్టులు ఏర్పాటు చేయడానికి, అవసరమైన 1730 పోస్టులు సృష్టించడానికి ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు. పోలవరం లిఫ్ట్ స్కీం పనిని కొనసాగించేందుకు మేఘాకు అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. కడప జిల్లాలో 2400 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మించనున్న కొప్పొలు పంప్డ్హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు కోసం గండికోట రిజర్వాయర్ నుంచి నీటిని కేటాయించే ప్రతిపాదనను ఆమోదించామని తెలిపారు.
రాష్ట్రంలో ఏర్పాటు చేసే పునరుత్పాదక ఇంధన తయారీ జోన్ల(సోలార్ ప్యానెల్, బ్యాటరీ వంటి తయారీ పరిశ్రమలు)కు నోడల్ ఏజెన్సీగా ఇక నుంచి నెడ్‌క్యాప్ ఉండేందుకు జారీ చేసిన జివోలను ఆమోదించామన్నారు. అమరావతి రాజధానిలో విద్యుత్ పనులకు వసూలు చేస్తున్న 15శాతం చార్జీలను 2.5శాతానికి తగ్గించేందుకు ఆమోదం తెలిపామని చెప్పారు. సుజ్లాన్ ఎనర్జీ, ఆక్సిస్ ఎనర్జీ ప్రాజెక్టుల పూర్తిచేసే గడువును మరో రెండేళ్లు పెంచామని తెలిపారు.

More Stories
మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం.. 13 మంది సజీవ దహనం
ఏపీలో మూడు పుణ్యక్షేత్రాల్లో గిరి ప్రదక్షిణ మార్గాలు
విజయవాడలో ఉగ్రవాద ముఠా గుట్టురట్టు