హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ ఇరాన్‌కు విధించిన 48 గంటల గడువుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. రెండ్రోజులుగా ఇరాన్‌తో చర్చలు ఫలవంతంగా జరగడంతో దాడులను విద్యుత్, ఇంధన సదుపాయాలపై దాడులను ఐదు రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇజ్రాయిల్ విద్యుత్ కేంద్రాలు, గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలకు విద్యుత్ సరఫరా చేసే కేంద్రాలపై దాడులు చేపడతామని ఇరాన్ హెచ్చరించడంతో ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇతర ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేయనున్నట్లు అమెరికా సోమవారం ప్రకటించింది.
ఈ నిర్ణయంపై స్పందించిన ఇరాన్ ట్రంప్ భయపడ్డారని ఎద్దేవా చేసింది. తాము ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేసింది. ట్రంప్ నిర్ణయంతో ముడిచమురు ధర అమాంతం పడిపోయింది. హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ ఇరాన్‌కు విధించిన 48 గంటల డెడ్‌లైన్‌ను ట్రంప్ వాయిదా వేశారు. ఇరాన్‌లోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఇంధన మౌలిక వసతులపై దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేయాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు.
”మధ్యప్రాచ్యంలో మన మధ్య ఉన్న శతృత్వాలకు పూర్తి, పరిష్కారంపై గత రెండు రోజులుగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇరాన్ మధ్య చాలా మంచి ఫలవంతమైన చర్యలు జరిగాయని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. లోతైన, విశ్లేషణాత్మక, నిర్మాణాత్మక చర్యలు ఈ వారంలో కూడా కొనసాగుతాయి. కొనసాగుతున్న సమావేశాలు, చర్చలు విజయవంతం కానున్నందున, ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సాదుపాయాలపై అన్ని రకాల సైనిక దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేయాలని నేను భద్రతా దళాన్ని ఆదేశించాను” అని ప్రకటించారు.
ఈ వారం అంతటా తమ మధ్య లోతైన, సవివరమైన, నిర్మాణాత్మక చర్చలు కొనసాగనున్నాయని పోస్టుచేశారు. సానుకూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై జరపాల్సిన అన్ని రకాల సైనిక దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేయాలని యుద్ధ శాఖను ఆదేశించానని పేర్కొన్నారు. అయితే, పూర్తి నిర్ణయం మాత్రం ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు, చర్చల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని వివరించారు.
ఈ విషయంపై మీరు శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు అంటూ ట్రంప్ రాసుకొచ్చారు. అటు తమ హెచ్చరికలతో ట్రంప్, భయపడిపోయారని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రకటించింది. యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. పర్షియన్ గల్ఫ్ అంతటా మైన్లు పెడతామని, గల్ఫ్‌లోని విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని తాము చేసిన హెచ్చరిక వల్లే ఆయన వెనక్కి తగ్గారని పేర్కొంది. నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్న ట్రంప్ వాదనను తిరస్కరించింది.
ట్రంప్‌తో ప్రత్యక్షంగా గానీ మధ్యవర్తుల ద్వారా గానీ ఎలాంటి చర్చలు జరగలేదని పేర్కొంది. అటు ఇరాన్ సైన్యం కూడా ట్రంప్‌ను ఎద్దేవా చేసింది. హే ట్రంప్, నిన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామంటూ ఖతమ్ అల్-అన్బియా కేంద్ర ప్రధాన కార్యాలయ ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫఘారి ఎగతాళి చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై మీరు శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు అంటూ ట్రంప్ చేసిన పోస్టును ఉటంకిస్తూ జొల్ఫఘారి ఒక వీడియో క్లిప్ విడుదల చేశారు.
మరోవైపు ఇరాన్ విద్యుత్, ఇంధన సదుపాయాలపై దాడులను ఐదు రోజులు వాయిదా వేస్తామని ట్రంప్ ప్రకటన చేయగానే ఇంధన ధరలు అమాంతం పడిపోయాయి. బ్యారెల్ ముడి చమురు ధర 13 శాతం, అంటే సుమారు 17 డాలర్లు తగ్గి 96 డాలర్లకు చేరుకుంది.

More Stories
దౌత్యం, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలి
బ్రిటిష్ కర్కశంకు నిదర్శనం “బలిదాన దివస్”
ఎబివిపి నిరసనలతో జమ్మూలో జిన్నా పాఠం తొలగింపు!