దౌత్యం, చ‌ర్చ‌ల ద్వారానే స‌మ‌స్య‌ను పరిష్కరించుకోవాలి

దౌత్యం, చ‌ర్చ‌ల ద్వారానే స‌మ‌స్య‌ను పరిష్కరించుకోవాలి

* భార‌త్ వ‌ద్ద ప్ర‌స్తుతం 53 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల వ్యూహాత్మక రిజ‌ర్వ్ పెట్రోల్

దౌత్యం, చ‌ర్చ‌ల ద్వారానే  ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని ప్రధాని నరేంద్ర మోదీ హితవు చెప్పారు. దౌత్య‌ప‌ర‌మైన అంశంలో భార‌త్ స్ప‌ష్టంగా ఉంద‌ని, ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించేందుకు భార‌త్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని  ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ప‌రిస్థితిపై లోక్‌స‌భ‌లో మాట్లాడుతూ తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని, అది చాలా కాలం కొనసాగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. 

ఉద్రిక్తతల వల్ల గల్ఫ్ దేశాలకు సమస్యలు వస్తున్నాయని, భారత్‌ కూడా సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు.  ఆ ప‌రిస్థితుల‌ను ఎదుర్కోనేందుకు సిద్దంగా ఉండాల‌ని, ఐక్యంగా ఉండాల‌ని ఆయ‌న పిలుపిచ్చారు.  ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిని కొంద‌రు అడ్వాంటేజ్ తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతూ అందుకే శాంతి భ‌ద్ర‌త‌ల‌ను సరైన రీతిలో మానిట‌ర్ చేయాల‌ని సూచించారు. 

సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భార‌త్ సిద్ధంగా ఉంద‌ని పేర్కొంటూ  గ‌త దశాబ్ధం కాలం నుంచి ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రాధాన్యత ఇచ్చామ‌ని, దీనిలో భాగంగా ముడి చ‌మురును స్టోరేజీని పెంచామ‌ని తెలిపారు.  భార‌త్ వ‌ద్ద ప్ర‌స్తుతం 53 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల వ్యూహాత్మక రిజ‌ర్వ్ పెట్రోల్ ఉంద‌ని ప్ర‌ధాని వెల్ల‌డించారు. ఇది ఆయ‌ల్ కంపెనీల వ‌ద్ద ఉన్న రిజ‌ర్వ్‌ల‌కు సంబంధం లేనిద‌ని ఆయ‌న చెప్పారు.

“గత 11 ఏళ్లలో మన ఇంధన దిగుమతులను వైవిధ్యభరితం చేశాం. ఇంతకుముందు 27 దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. ఇప్పుడు 41 దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. మన వద్ద 53 లక్షల మెట్రిక్ టన్నుల వ్యూహాత్మక నిల్వలు ఉన్నాయి. చమురు, గ్యాస్, ఎరువులను రవాణా చేసే ట్యాంకర్లు దేశానికి సురక్షితంగా చేరుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని ప్రధాని మోదీ లోక్‌సభకు వివరించారు.

ఇథ‌నాల్ బ్లెండింగ్ వ‌ల్ల గ‌తంతో పోలిస్తే భార‌త్ సుమారు 4.5 కోట్ల బ్యార‌ళ్ల ఇంధ‌నాన్ని త‌క్కువ దిగుమ‌తి చేసుకుంటోంద‌ని ప్ర‌ధాని తెలిపారు. గ‌డిచిన 11 ఏళ్ల కాలంలో రిఫైన‌రీ కేపాసిటీ కూడా పెంచుకున్నామ‌ని ప్ర‌ధాని తెలిపారు. ప్రజలకు పెట్రోల్, వంట గ్యాస్ కొరత లేకుండా చూస్తున్నామని, ఎల్పీజీలో 60 శాతం దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నామని, 41 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని మోదీ వివరించారు.

రైల్వేల విద్యుదీకరణతో 180 కోట్ల లీటర్ల డీజిల్ ఆదా అయ్యిందని మోదీ పేర్కొన్నారు. భారత్‌లో పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదని, తగినన్ని నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. వ్య‌వ‌సాయంపై కూడా ప‌శ్చిమాసియా యుద్ధ ప్ర‌భావం ప‌డుతుంద‌ని చెబుతూ అయితే ప్ర‌భుత్వం మాత్రం కావాల్సినంత ఎరువులను  స‌మ‌కూర్చుతోంద‌ని ప్రధాని భరోసా ఇచ్చారు.

రైతుల‌పై కరోనా లాంటి ప‌రిస్థితులు ప్ర‌భావం ప‌డ‌కుండా చూస్తున్నామ‌ని పేర్కొన్నారు. రైతుల‌ను ఆదుకునేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు.  ప‌శ్చిమాసియాలో యుద్దం మొదలైన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు 3.75 ల‌క్ష‌ల మంది భార‌తీయులు తిరిగి వ‌చ్చిన‌ట్లు చెప్పారు. కేవ‌లం ఇరాన్ నుంచి 1000 మంది భార‌తీయులు సుర‌క్షితంగా వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు. దీంట్లో ఎంబీబీఎస్ చ‌దువుతున్న 700 మంది విద్యార్థులు ఉన్నారు.

ప‌శ్చిమాసియా ప్ర‌భావాన్ని త‌గ్గించేందుకు స్వ‌ల్ప కాలిక‌, మ‌ధ్య‌శ్రేణి, దీర్ఘ‌కాలిక వ్యూహాల‌ను అనుస‌రిస్తున్న‌ట్లు చెప్పారు. యుద్ధం జ‌రుగుతున్న ప‌శ్చిమాసియాలో ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. ప‌శ్చిమాసియా సంక్షోభం ప‌ట్ల భార‌త పార్ల‌మెంట్ ఒకే స్వ‌రాన్ని వినిపించాల‌ని సూచించారు. ఆ సంక్షోభం మొద‌లై మూడు వారాలు దాటింద‌ని, ప్ర‌తి ఒక్క‌రికీ అది ప్ర‌భావం చూపుతోంద‌ని తెలిపారు. 

యుద్ధం జ‌రుగుతున్న దేశాల‌తో భార‌త్‌కు కీల‌క‌మైన వ్యాపార లావాదేవీలు ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. భారత్‌కు ఎక్కువగా గల్ఫ్‌ నుంచే ముడిచమురు, గ్యాస్‌ వస్తోందని యుద్ధం వల్ల ఇతర దేశాలతో జరిగే వాణిజ్యం దెబ్బతింటోందని తెలిపారు.