వాట్సాప్‌కు ధీటైన స్వదేశీ యాప్ ‘హైప్డ్ సంవాదిని’!

వాట్సాప్‌కు ధీటైన స్వదేశీ యాప్ ‘హైప్డ్ సంవాదిని’!

ప్రస్తుతం దేశంలో 80 కోట్ల మందికి పైగా భారతీయ పౌరులు విదేశీ డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారంపై ఆధారపడి ఉన్నారు. వీటి వల్ల భారీగా వివిధ మార్గాల్లో సైబర్ మోసాలు జరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఆధ్వర్యంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఏఐ అనువాదిని ‘హైప్డ్ సంవాదిని’, ‘దేశీ ఏఐ జెన్‌జీ కీ బోర్డు’ పేర్లతో రెండు అత్యాధునిక యాప్‌లను అభివృద్ధి చేసింది.

ఇవి సాంకేతికంగా అభివృద్ధి చెందడమే కాకుండా వినియోగాదారుల భద్రత, గోప్యతతోపాటు భాషా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏఐసీటీఈ రూపొందించింది. భారతదేశంలో సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏఐసీటీఈకి చెందిన `అనువాదిని  ఏఐ’ బృందం ‘హైప్డ్ సంవాదిని’ యాప్‌ను రూపొందించింది. విదేశీ యాప్‌లపై ఆధారపడకుండా, భారతీయుల డేటా భారత్‌లోనే భద్రంగా ఉండాలనే లక్ష్యంతో దీనిని తీసుకొచ్చారు. 

 ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ యాప్, వినియోగదారుల గోప్యతకు పెద్దపీట వేస్తుంది.  సాధారణ మెసేజింగ్ యాప్‌లలో లేని అత్యున్నత భద్రతా ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. అడ్వాన్స్‌డ్ యాంటీస్పామ్ మెకానిజాన్ని ఇందులో పొందుపరిచారు. ఇది సైబర్ మోసాలను నియంత్రిస్తోందని కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ముఖ్యంగా `సిం, డివైస్ బిండింగ్’ ఫీచర్ ద్వారా సిమ్ స్వాప్ మోసాలను అరికట్టవచ్చు.  ఒకవేళ మీ ప్రమేయం లేకుండా సిమ్ కార్డ్ మారినా లేదా వేరే డివైస్‌లో లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినా యాప్ వెంటనే అప్రమత్తం చేస్తుంది. అంతేకాకుండా, మీ ఫోన్ నంబర్ ఇతరులకు తెలియకుండానే `డైనమిక్ చాట్ ఐడి’ల ద్వారా కనెక్ట్ అయ్యే సౌలభ్యం ఉంది.

దీనివల్ల మహిళలు, ప్రైవసీ కోరుకునే వారికి ఇది సురక్షితమైన వేదికగా మారుతుంది. ఈ యాప్‌లో ఉన్న అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ బహుభాషా సౌలభ్యం. ఏకంగా 22 అధికారిక భారతీయ భాషలతో పాటు 50కి పైగా అంతర్జాతీయ భాషల్లో ఇది రియల్-టైమ్ ట్రాన్స్‌లేషన్‌ను అందిస్తుంది. అంటే అవతలి వ్యక్తి తనకు నచ్చిన భాషలో మెసేజ్ పంపినా, మీరు మీకు కావాల్సిన భాషలో (ఉదాహరణకు తెలుగులో) దానిని తక్షణమే చదువుకోవచ్చు. ఆడియో, వీడియో కాల్స్ సైతం చేసుకోవచ్చు.

భాషా పరమైన అడ్డంకులను తొలగించడంలో ఇది విప్లవాత్మక మార్పు అని చెప్పవచ్చు.  మహిళలు, వృద్ధుల రక్షణ కోసం ఇందులో  `వన్-ట్యాప్ ఎస్ఓఎస్ అలెర్ట్’,  లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.  వినియోగదారులు తమ పాత వాట్సాప్ చాట్‌లను కూడా సులభంగా హైప్డ్ సంవాదినిలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దీనితో పాటు విడుదలైన `డెసి ఏఐ జెన్ జెడ్ కీబోర్డ్’ స్మార్ట్ టైపింగ్, గెస్చర్ టైపింగ్ ద్వారా టైపింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తుంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా మీ సంభాషణలు పూర్తి సురక్షితంగా ఉంటాయి.

ఇది ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలపరుస్తుంది. ఏఐ ద్వారా అభివృద్ధి చేసిన ఈ రెండు యాప్‌లు పూర్తి స్వదేశీ డిజిటల్ పరిష్కారాలని స్పష్టం చేస్తున్నారు. ఇవి భారతదేశంలోని భాషా శక్తి, సాంకేతిక సామర్థ్యంతోపాటు ఆవిష్కరణలను ప్రతిబింబిస్తాయి. అలాగే భారతదేశం డిజిటల్ భవిష్యత్తు వైపు సాగుతోందని దీని ద్వారా స్పష్టమవుతుంది.