బ్రిటిష్ కర్కశంకు నిదర్శనం “బలిదాన దివస్”  

బ్రిటిష్ కర్కశంకు నిదర్శనం “బలిదాన దివస్”  
ఆకారపు కేశవరాజు
సంయుక్త కార్యదర్శి, విశ్వహిందూ పరిషత్ 

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అత్యంత ప్రముఖ విప్లవ వీరులు. లాహోర్ కుట్ర కేసులో బ్రిటిష్ పోలీసు అధికారి జాన్ సాండర్స్ (లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారంగా) హత్యకు సంబంధించి, 1931 మార్చి 23న లాహోర్ జైలులో ఉరితీసారు. ఈ త్యాగానికి గుర్తింపుగా మార్చి 23ని దేశవ్యాప్తంగా “అమరవీరుల దినోత్సవం” గా జరుపుకుంటాం.” అమరవీరులకు కోటి కోటి అవివాదములు సమర్పించుకుంటున్నాను.

నిర్ణయించిన సమయం (మార్చి 24) కంటే ఒకరోజు ముందుగానే, 1931 మార్చి 23 సాయంత్రం 7:30 గంటలకు ఉరి తీశారు. జైలు ఎదురుగా గుమికూడిన ప్రజా సమూహానికి భయపడి జైలు వెనుక నుండే గోనెసంచుల్లో శవాలను శవాల కాళ్లు చేతులు వేరుచేసి తీసుకువెళ్లారు.   అమరవీరుల శవాలను తల్లిదండ్రులకు అప్పగిస్తే వారు యాత్రగా తీసుకెళ్తే బలిదానుల శవాలను చూసిన ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంటుందని, తిరుగుబాటు వస్తుందని గ్రహించిన ఆంగ్లేయులు ప్రజలందరికీ విషయం తెలియకుండా ఉండాలని నదీ మధ్యలోకి తీసుకెళ్లి దహనం చేశారు.
 
లాహోర్ సెంట్రల్ జైలు, ప్రస్తుత పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ‘రావినది’ ఒడ్డున ఉంది. వారి మృతదేహాలను రహస్యంగా తరలించి, సట్లెజ్ నది తీరాన ఉన్న హుస్సేన్‌వాలాలో దహనం చేశారు.  బ్రిటిష్ ప్రభుత్వ అత్యంత పాశవికంగా చేసిన రక్తపాత చర్యలలో ఇదొక్కటి.  మృతదేహాలను ఈడ్చుకెళ్లి ముక్కలుగా నరికి సంచుల్లో నింపి, సట్లెజ్ నది ఒడ్డున రాత్రిపూట అప్పటికే ఏర్పాటు చేసిన చితుల మీద శరీరపు ముక్కలను పెట్టి అంత్యక్రియల జరిపి తెల్లవారుజామూన పూర్తిగా దహనం కాని అవశేషాలను నదిలో విసిరేసి వెళ్లిపోయారు.
పోలీసులు వెళ్లిపోవడంతో అనుమానంతో గ్రామస్థులు నీటిలోకి దిగి దహనం కానీ శరీర భాగాలను వెలికితీసి వాటిని సక్రమంగా దహనం చేశారు.  (సత్వీందర్ సింగ్ జస్ రచించిన ‘ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ భగత్ సింగ్: లీగల్ హెరెసీస్ ఆఫ్ ది రాజ్’ నుండి). జైలులో మృత్యువుకు భయపడకుండా చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడిన ఈ ముగ్గురు యోధులు, వందేమాతరం అని చెబుతూ స్వాతంత్రం కోసం చేసిన మా ప్రాణాల బలిదానం ఫలితం ఇస్తుందని త్వరలోనే స్వాతంత్రం సిద్ధిస్తుందని ప్రకటించారు.   మళ్లీ మళ్లీ ఈ పుణ్యదేశంలోనే,  ఈ నెల పైనే జన్మిస్తామంటూ ప్రతిజ్ఞలు చేస్తూ అమరులైపోయారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో యువతకు స్ఫూర్తిగా నిలిచారు.
 
1928లో, యునైటెడ్ కింగ్‌డమ్ భారతదేశంలోని రాజకీయ పరిస్థితులను తెలుసుకొని తమకు నివేదించడానికి సర్ జాన్ సైమన్ అనే ఆంగ్ల అధికారి నేతృత్వంలో సైమన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్‌ను భారతీయ రాజకీయ పార్టీలు బహిష్కరించాయి. ఎందుకంటే ఇందులో భారతీయ సభ్యులు ఎవరూ లేరని, విదేశా నుండి వచ్చే వాడికి మన దేశ పరిస్థితులు ఎలా తెలుస్తాయని దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
 
సైమన్ కమిషన్ 30 అక్టోబర్ 1928న లాహోర్‌ను సందర్శించినప్పుడు లజపత్ రాయ్ ఒక నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించి “సైమన్ గో బ్యాక్” అనే నినాదాన్ని ఇచ్చారు. నిరసనకారులు నల్లజెండాలు చేతబూని నినాదాలు చేశారు. లాహోర్ లోని పోలీసు సూపరింటెండెంట్, జేమ్స్ ఎ. స్కాట్, నిరసనకారులపై లాఠీఛార్జ్ చేయమని పోలీసులను ఆదేశించాడు. రాయ్‌పై వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దాడి చేయగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
రాయ్  ప్రజలను ఉద్దేశించి “ఈరోజు నాపై పడిన దెబ్బలు భారతదేశంలోని బ్రిటీష్ పాలన శవపేటికకు చివరి మేకులు అవుతాయని నేను ప్రకటిస్తున్నాను” అని ప్రకటించారు.  తీవ్రంగా గాయపడిన కారణంగా 1928 నవంబర్ 17 ఆయన మరణించారు. ఆయన మరణం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను, ముఖ్యంగా యువకులను కదిలించింది.. భగత్ సింగ్ పోరాటానికి ఆజ్యం పోసింది. 
 
తన స్నేహితులు సుఖ్ దేవ్, రాజగురులతో కలిసి లాల మరణానికి కారణమైన జేమ్స్ స్కాట్ ను చంపే క్రమంలో పొరపాటున జాన్ సౌండర్స్ అనే మరో అధికారిని హతమార్చుతారు. ఈ కేసుపైనే బ్రిటిషర్లు వీరిని అరెస్ట్ చేసి 1931 మార్చి 23న ఉరి తీశారు. వీరి పోరాటానికి నివాళిగా ఏటా ఈరోజును “అమర బలిదాన దివస్” గా జరుపుకుంటాం. దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన ఆ మహనీయులను స్మరించుకుంటూ వారి త్యాగం నేటి యువతీ యువకుల గుండెల్లో ప్రేరణనిస్తూ పదిలంగా ఉన్నదని చాటిచెబుతున్నాను.