అమెరికా పాక్ పై బాంబులు వేస్తె భారత్ పై వేస్తాం

అమెరికా పాక్ పై బాంబులు వేస్తె భారత్ పై వేస్తాం
* పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త వివాదాస్పద వ్యాఖ్యలు 
పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ భారత్‌ను ఉద్దేశించి  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు భారత్‌లో పాక్ హైకమిషనర్‌గా పని చేసిన ఆయన ఏకంగా భారత మెట్రో నగరాలపై అణు దాడులు చేస్తామంటూ బహిరంగంగా హెచ్చరించారు.  ఒకవేళ  అమెరికా తమ దేశంపై దాడికి పాల్పడితే తాము భారత్‌లోని ఢిల్లీ, ముంబై నగరాలపై బాంబులు వేస్తామని బసిత్ వివాదానికి తెర తీశారు. 
 
అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆయన భారత్‌పై విషంగక్కారు. అమెరికా ఇంటెలిజెన్స్ కమిటీ హౌస్‌కు 2026లో ముప్పు విశ్లేషణకు సంబంధించిన నివేదికలో పాకిస్థాన్‌ నుంచి ముప్పు పొంచి ఉందని తులసీ గబ్బార్డ్ తెలిపారు. పాకిస్థాన్ క్షిపణులు తమ ప్రాంతంపై దాడి చేయగలవని ఆమె పేర్కొనడంపై అబ్దుల్ బసితో స్పందిస్తూ భారతీయులరాలైన తులసీ గబ్బార్డ్ పాకిస్థాన్‌పై వ్యతిరేకత వెలిబుచ్చడంలో ఆశ్చర్యమే లేదని పేర్కొన్నారు.
 
“ఆమె భారతీయురాలు. పాకిస్థాన్ చేప్టటే నియంత్రణ చర్యలన్నీ భారత్‌కే వర్తిస్తాయి. ఆమె మా క్షిపణులను చూశారు. కానీ, భారత్‌కు అగ్ని 5, అగ్ని 6 వంటి ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. వాటిలా సుదూరు లక్ష్యాలను ఛేదించే మిస్సైల్స్ మాకు లేవు. మేము కనీసం ఇజ్రాయేల్‌ను అయినా టార్గెట్ చేస్తాం” అని పాకిస్థాక్‌కు చెందిన ఏబీఎన్‌ న్యూస్‌లో బసిత్ వెల్లడించారు. అంతేకాదు పాకిస్థాన్ క్షిపణుల సామర్ధ్యం గురించి మాట్లాడేటప్పుడు భారత దేశం ప్రస్తావనను అమెరికా తీసుకు రాదని తాను భావించానని బసిత్ చెప్పారు. 
 
“ఒకవేళ అమెరికా మా అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే దానికి ప్రతీకారంగా మేం ఢిల్లీ, ముంబై వంటి భారత నగరాలపై బాంబులు వేస్తాం” అని ఆయన నోరుపారేసుకున్నారు.  అమెరికాపై కోపాన్ని భారత్‌పై చూపించాలనడానికి ఆయన ఒక వింత తర్కాన్ని వినిపించారు. “అమెరికా మమ్మల్ని అటాక్ చేస్తే గల్ఫ్ దేశాల్లో ఉన్న వారి స్థావరాలపై గానీ, ఇజ్రాయెల్‌పై గానీ దాడులు చేయడం మాకు భౌగోళికంగా కష్టతరం కావచ్చు” అని చెప్పారు. 
 
“కానీ భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం మాకు చాలా సులభం. అందుకే మరో ఆలోచన లేకుండా భారత్‌పై దాడులకు దిగుతాం. ఇందుకు పాకిస్థాన్ ఏ మాత్రం వెనకాడదు” అని బాసిత్ చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ తన అణు కార్యక్రమం విషయంలో ఆందోళన చెందుతోంది.  ఈ క్రమంలోనే బాసిత్ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
గతంలోనూ ఆయన కాశ్మీర్ అంశంపై, భారత విదేశాంగ విధానంపై అనేకసార్లు విషం చిమ్మారు. ఇదిలా ఉండగా,  అబ్దుల్ బాసిత్ చేసిన ఈ దిగజారుడు వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.  ఇలాంటి అర్థం లేని వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని భారత దౌత్య వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
అయితే సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు బాసిత్‌ను ఏకిపారేస్తున్నారు. “సొంత దేశంలో తిండి లేక అలమటిస్తున్నా.. ఇంకా పక్క దేశంపై దాడుల గురించి మాట్లాడటం పాక్ నాయకులకే చెల్లింది” అంటూ ఎద్దేవా చేస్తున్నారు.