ఇరాన్ పై దాడులను అరికట్టడంలో ‘బ్రిక్స్’ జోక్యం చేసుకోవాలి

ఇరాన్ పై దాడులను అరికట్టడంలో ‘బ్రిక్స్’ జోక్యం చేసుకోవాలి
ఇరాన్‌పై దురాక్రమణలను అరికట్టడంలోనూ, ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, స్థిరత్వాన్ని పరిరక్షించడంలోనూ బ్రిక్స్ కూటమి స్వతంత్ర పాత్ర పోషించాలని ఇరాన్ అధ్యక్షుడు డా. మసూద్ పెజెష్కియన్ పిలుపునిచ్చారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నౌరూజ్, ఈద్ పండుగల సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడుతో టెలిఫోన్ లో మాట్లాడుతూ ఈ ప్రాంతమంతటా కీలక మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఈ దాడులు “ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు” అని ఆయన పేర్కొన్నారు.
 
వారిద్దరి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణల సారాంశాన్ని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఇరాన్ అధ్యక్షుడు అమెరికా, ఇజ్రాయెల్ పాల్పడిన దురాక్రమణ, చట్టవిరుద్ధమైన దాడులు, నేరాల పరిమాణాలను వివరిస్తూ దాడులను అరికట్టడంలో బ్రిక్స్ జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం బ్రిక్స్ కు భారత్ అధ్యక్ష హోదాలో ఉండటం తెలిసిందే. 

యుద్ధం, సంఘర్షణ ముగియాలంటే అమెరికా, ఇజ్రాయెల్‌ల దురాక్రమణలు తక్షణమే ఆగిపోవాలని, భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా హామీలు ఇవ్వడం తప్పనిసరి అని ఆయన మరింతగా నొక్కి చెప్పారు. ప్రస్తుత యుద్ధాన్ని ఇరాన్ ప్రారంభించలేదని స్పష్టం చేస్తూ అణు చర్చల కొనసాగుతుండగానే చట్టపరమైన ఎలాంటి ఆధారం లేకుండా ఇరాన్‌పై సైనిక దాడులు ప్రారంభించారని మోదీకి తెలిపారు. 
 
దీని ఫలితంగా తమ సుప్రీం లీడర్, సైనిక కమాండర్లు, అమాయక విద్యార్థులు సహా అనేక మంది నిస్సహాయలు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.  తమ పొరుగు దేశాలలోని స్థావరాల నుంచి మినాబ్ లోని పాఠశాలను అమెరికా అలక్ష్యంగా చేసుకోవడంతో 168 మంది అమాయక చిన్నారులు మరణించారని గుర్తు చేశారు. 
 
తాము అణ్వాయుధాలను సమకూర్చుకోకుండా నిరోధించడమే సైనిక చర్య ఉద్దేశమని అమెరికా అధ్యక్షుడు చేసిన వాదనలను ఇరాన్  అధ్యక్షుడు తోసిపుచ్చారు.  తమ సుప్రీం లీడర్ పలు సమావేశాలలో అణ్వాయుధాలను గట్టిగా వ్యతిరేకించారని, వాటి అభివృద్ధి దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకుండా పరిపాలనాపరమైన, మతపరమైన ఆదేశాలు జారీ చేశారని నొక్కి చెప్పారు.  
 
తమ శాంతియుత అణు కార్యకలాపాలపై పర్యవేక్షణ ధ్రువీకరణకు ఐక్యరాజ్యసమితి సహా ప్రపంచ నాయకులతో ప్రత్యక్ష సంభాషణలలో పాల్గొనడానికి ఇరాన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని పెజిష్కియాన్ పునరుద్ఘాటించారు. విదేశీ జోక్యం లేకుండా ప్రాంతీయ సహకారం ద్వారా ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని నిర్ధారించే లక్ష్యంతో పశ్చిమాసియా దేశాలతో కూడిన ఒక ప్రాంతీయ భద్రతా చట్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆయన ప్రతిపాదించారు. 
 
పశ్చిమాసియాలో అస్థిరత, ఉద్రిక్తతలకు ఇరాన్‌ను మూల కారణంగా చిత్రీకరిస్తున్న అమెరికా ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు. భద్రత, శాంతిని కాపాడాలనే నెపంతో తన చర్యలను సమర్థించుకుంటూ.. లెబనాన్, గాజా, ఇరాన్, ఇరాక్, ఖతార్, ఇతర ప్రాంతాలలో ఇజ్రాయెల్ దాడులు, హత్యలు చేస్తోందని, వాస్తవానికి పశ్చిమాసియాలో అశాంతికి, సంఘర్షణలను ఆ దేశమే ప్రేరేపిస్తోందని ఆయన ఆరోపించారు. 
కాగా, “అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియన్‌తో మాట్లాడి, ఈద్, నౌరూజ్ శుభాకాంక్షలు తెలియజేశాను. ఈ పండుగ కాలం పశ్చిమ ఆసియాకు శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును తీసుకువస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేశాము,” అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
 
 కీలకమైన సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం నేపథ్యంలో, నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించడం, షిప్పింగ్ మార్గాలు తెరిచి సురక్షితంగా ఉండేలా చూడాల్సిన ప్రాముఖ్యతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. “ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు కలిగించి, ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించే ఈ ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాలపై దాడులను ఖండించాను,” అని ఆయన జోడించారు.
 
 కీలకమైన సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధి దిగ్బంధంలో ఉన్నప్పటికీ, “నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించడం, షిప్పింగ్ మార్గాలు తెరిచి సురక్షితంగా ఉండేలా చూడటం”  ప్రాముఖ్యతను తాను పునరుద్ఘాటించినట్లు మోదీ తెలిపారు.  “ఇరాన్‌లో ఉన్న భారత పౌరుల భద్రతకు ఇరాన్ అందిస్తున్న నిరంతర మద్దతును అభినందించాను” అని ఆయన చెప్పారు.