కేరళం గడ్డపై ఎన్డీఏ జెండా ఎగరడం ఖాయం

కేరళం గడ్డపై ఎన్డీఏ జెండా ఎగరడం ఖాయం
* కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ధీమా
కేరళంలో ప్రస్తుతం కనిపిస్తున్న నాయకుల ఉత్సాహం, ప్రజల మద్దతు చూస్తుంటే దశాబ్దాల కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడి, ఈసారి కేరళ గడ్డపై ఎన్డీఏ జెండా ఎగరడం ఖాయమని  కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ధీమా వ్యక్తం చేశారు. కేరళం అభివృద్ధిని అడ్డుకుంటున్న ఎల్డిఎఫ్, యూడీఎఫ్ కూటములకు ఏకైక ప్రత్యామ్నాయం ఎన్డీఏ మాత్రమేనని స్పష్టం చేశారు. 

కేరళలోని చాలకుడి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్డీయే “ప్రవాసీ ప్రభారి”గా ప్రచార బాధ్యతలను అప్పజెప్పడంతో  గత మూడు రోజులుగా పార్లమెంట్ పరిధిలో నిర్విరామంగా పర్యటిస్తున్నారు. పట్టిమట్టం, అంగమాలి, కున్నతునాడ్ వంటి కీలక ప్రాంతాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నారు.

కున్నతునాడ్ నియోజకవర్గం పట్టిమట్టంలో జరిగిన శక్తికేంద్ర ప్రముఖుల సమన్వయ సమావేశంలో పాల్గొంటూ ఎన్డీఏ అభ్యర్థిగా ట్వంటీ-20 పార్టీ తరపున బరిలో ఉన్న బాబు దివాకరన్ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయి నుండే ఓటర్లను చైతన్యపరచాలని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు. 

ప్రధాని మోదీ నాయత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే కేరళం సమగ్ర అభివృద్ధి సాధ్యమని డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, ట్వంటీ-20, బీడీజేఎస్ పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి ఎన్డీఏ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, ట్వంటీ-20 పార్టీ సాబు జాకబ్, ఎర్నాకుళం ఈస్ట్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సజీవ్, ట్వంటీ-20, బీడీజేఎస్ పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.