దాదాపు రెండు వారాలుగా ఇజ్రాయిల్ తో కలిసి ఇరాన్ పై యుద్ధం చేస్తున్నా, ఈ యుద్ధంలో తమ లక్ష్యాలపై దాడులు పూర్తయ్యాయని, వారి సైన్యంపై ఆధిపత్యం సాధించామని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొంటున్నా ఇరాన్ లో నాయకత్వం స్థిరంగా ఉందని, ఇప్పట్లో ప్రభుత్వం కూలిపోయే అవకాశం లేదని అమెరికా నిఘా సంచలన నివేదిక బయటపెట్టింది.
అమెరికా గూఢచారి వర్గాలు సేకరించిన పలు నివేదికలు ప్రస్తుతం ఇరాన్‌లో ప్రభుత్వానికి తక్షణ ముప్పులేదని ఒక వర్గం పేర్కొంది. అంతేకాదు, ఇప్పటికీ ప్రజలపై ప్రభుత్వానికి నియంత్రణ కొనసాగుతుందని పేరు చెప్పడానికి నిరాకరించిన అధికార వర్గాలు సూచించినట్టు తెలిపింది. చమురు ధరలు, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ భయాల నేపథ్యంలో ఒత్తిడి పెరుగుతున్నందున 2003 తర్వాత అమెరికా చేపట్టిన అతిపెద్ద ఈ సైనిక ఆపరేషన్ ను త్వరగా ముగిస్తామనే సంకేతాలు ట్రంప్ ఇస్తున్నా ఇరాన్ నాయకత్వం కఠిన వైఖరి కొనసాగితే యుద్దానికి ఆమోదయోగ్యమైన ముగింపు అంత సులభం కాదని పరిశీలకులు భావిస్తున్నారు.
ఫిబ్రవరి 28న జరిపిన దాడిలో ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించినా, పదుల సంఖ్యలో కీలక నాయకులు హతమైనా ఇరాన్‌లో మతాధికారుల నాయకత్వ వ్యవస్థ ఇప్పటికీ ఐక్యంగా కొనసాగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇజ్రాయెల్ అధికారుల అంతర్గత చర్చల్లోనూ ప్రస్తుత యుద్ధం కారణంగా ఇరాన్‌లో ఇస్లామిక్ ప్రభుత్వం పతనం అవుతుందనే నమ్మకం లేదనే అభిప్రాయం వ్యక్తమైనట్టు ఆ దేశ ఓ సీనియర్ అధికారి అన్నట్టు రాయిటర్స్ నివేదించింది.
ఫిబ్రవరి 28 అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించిన తర్వాత గగనతల రక్షణ, అణు స్థావరాలు, సీనియర్ నాయకత్వం సహా అనేక లక్ష్యాలపై దాడులు నిర్వహించాయి. ఈ యుద్ధానికి ట్రంప్ యంత్రాంగం వివిధ కారణాలు వెల్లడించింది. ఆపరేషన్ మొదలైనప్పుడు ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇరాన్ ప్రజలకు ట్రంప్ పిలుపునిచ్చారు.
కానీ, ఇరాన్ ప్రభుత్వాన్ని మార్చడం తమ ఉద్దేశం కాదని అమెరికా ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్ప్, తాత్కాలిక నాయకత్వం ఇప్పటికీ ప్రజలపై పూర్తిగా నియంత్రణ కొనసాగిస్తుందని అమెరికా నిఘా నివేదిక అభిప్రాయపడింది. అసెంబ్లీ నిపుణుల కమిటీ ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఖమేనీని ఇటీవల నూతన సుప్రీం లీడర్‌గా ఎన్నుకుంది.
కానీ, ఇజ్రాయెల్ మాత్రం పాత ప్రభుత్వ అవశేషాలను కొనసాగించబోమని, మతతత్వ వాదులను వదలిపెట్టబోమని తేల్చిచెప్పంది. అయితే, ప్రస్తుతం జరుగుతోన్న ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఖమేనీ ప్రభుత్వాన్ని ఎలా కూలదోస్తాయనేది స్పష్టతలేదు. ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి సురక్షితంగా నిరసన తెలిపేందుకు వీలుగా భూతల దాడి చేపట్టే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. ట్రంప్ యంత్రాంగం ఇరాన్‌లోకి అమెరికా దళాలను పంపే అవకాశాన్ని తోసిపుచ్చలేదు.

More Stories
గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలను తక్షణం మూసివేయాలి
యుద్ధం ముగింపుకు ఇరాన్ మూడు షరతులు
హర్మూజ్‌లో భారత నౌకలకు ఇరాన్ అనుమతి