లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తొలగింపు కోరుతూ విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బుధవారం లోక్‌సభలో వీగిపోయింది. సభ్యుల నినాదాలు, నిరసనల మధ్య మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఓటింగ్ అనంతరం సభ వాయిదా పడింది. లోక్‌సభ గురువారం ఉదయం 11 గంటలకు తిరిగి సమావేశమవుతుంది. నిష్పాక్షికంగా సభను నిర్వహించడంలో స్పీకర్ ఓం బిర్లా విఫలమయ్యారని ఆరోపిస్తూ విపక్షం ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
ఈ ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. గురువారం సభలో ఓం బిర్లా స్పీకర్ స్థానంలో ఆసీనులవుతారు. విపక్ష సభ్యుల ప్రవర్తనపై ఆయన సభలో ఓ ప్రకటన చేయనున్నారు. అవిశ్వాస తీర్మానంపై 10 గంటలకు పైగా చర్చ కొనసాగింది. పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్య పలుమార్లు వాడివేడి వాదనలు కొనసాగాయి. అవిశ్వాస తీర్మానం తిరస్కరణకు గురవుతుందని తెలిసినప్పటికీ, స్పీకర్ ఓం బిర్లా నిష్పాక్షికత, విశ్వసనీయత గురించి ప్రతిపక్షం తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తే ప్రయత్నం చేశారు.
చర్చలో పాల్గొన్న సభ్యులందరూ ఓం బిర్లా జోక్యాలను, ఆయన అధికార పక్షానికి మద్దతు పలికే వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ఇవి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. 12 సంవత్సరాలకు పైగా డిప్యూటీ స్పీకర్‌ను నియమించకపోవడంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్షం తీవ్రంగా విమర్శించింది.
స్పీకర్‌పై వచ్చిన తీవ్రమైన ఆరోపణలకు ప్రతిస్పందించడానికి బదులుగా, పాలక పక్షం చర్చలో సింహభాగాన్ని ప్రతిపక్షం, ప్రతిపక్ష నాయకుడిపై దాడి చేయడానికి ఉపయోగించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, బిజెపి ఎంపి నిషికాంత్ దూబే ప్రతిపక్షం లక్ష్యంగా విమర్శలు చేశారు. ప్రతిపక్ష నాయకుడి ప్రధానిని కౌగిలించుకోవడం, ఎగిరే ముద్దులు ఇవ్వడం అని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయి.
అమిత్ షా క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షం, ప్రతిపక్ష నాయకుడిపై అనవసర వ్యాఖ్యలు చేశారని నినాదాలు చేస్తూ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతూ అమిత్ షా విపక్షాలపై మండిపడ్డారు. లోక్‌సభ స్పీకర్ అధికార, విపక్షాలకు సమానంగా ప్రాతినిధ్యం వహించే ఒక నిష్పాక్షిక సంరక్షకుడని తెలిపారు. ఓం బిర్లాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఖండించిన ఆయన, సభ అనేది పార్లమెంటరీ నిబంధనల ప్రకారమే నడుస్తుందని, ఆయా రాజకీయపార్టీల రూల్స్ ప్రకారం నడవదని స్పష్టం చేశారు.
“స్పీకర్ చిత్తశుద్ధిని విపక్షాలు ప్రశ్నలు లేవనెత్తడం దేశ ప్రజాస్వామ్య ప్రక్రియనే ప్రశ్నించడంతో సమానం. మనం మన హక్కుల గురించి మాట్లాడవచ్చు. కానీ ఎవరూ సభ నియమాలను ఉల్లంఘించలేరు. స్పీకర్ నిర్ణయాలతో మనం ఏకీభవించలేకపోవచ్చు. కానీ మనం ఆయన మాటలకు కట్టుబడి ఉండాలే తప్ప సందేహించకూడదు. భారత పార్లమెంటరీ చరిత్రలో లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. గతంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పీకర్‌పై ఎప్పుడూ అవిశ్వాస తీర్మానం పెట్టలేదు” అని అమిత్ షా పేర్కొన్నారు.
లోక్‌సభ మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, ఒక పార్టీకి కాదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తెలిపారు. చర్చలో ఆయన మాట్లాడుతూ స్పీకర్‌పై చర్చలో పలుమార్లు తన పేరు లేవనెత్తుతూ తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించారు. తాము మాట్లాడేందుకు లేచిన ప్రతిసారీ ఆపుతారని, ప్రధానమంత్రి చేసిన రాజీల గురించి ప్రశ్న లేవనెత్తినప్పుడు చాలా సార్లు మాట్లాడకుండా ఆపేశారని ఆరోపించారు. దేశ చరిత్రలో తొలిసారి చర్చ సమయంలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడటానికి అనుమతించలేదని రాహుల్‌గాంధీ విచారం వ్యక్తం చేశారు.
పార్లమెంట్లో అసమ్మతికి స్థానం తగ్గిపోతున్నదని పేర్కొన్న విపక్ష సభ్యులు అధికార పక్షం పట్ల స్పీకర్ పక్షపాత వైఖరిని ఖండించేందుకే తాము ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు. స్పీకర్ నుంచి తమకు తగినంత రక్షణ లభించడం లేదని విపక్ష సభ్యులు తరచు భావిస్తున్నట్లు ఆర్జేడీ ఎంపీ అభయ్ కుమార్ సిన్హా చర్చ సందర్భంగా లోక్‌సభలో తెలిపారు.
సభ స్వతంత్రతకు స్పీకర్ ప్రాతినిధ్యం వహించడం లేదని, ఆయన అధికార పార్టీ దౌర్జన్యానికి చిహ్నంగా మారిపోయారని సిన్హా ఆరోపించారు. ఒకే రోజు 140 మందికిపైగా ఎంపీలను సస్పెండ్ చేసిన రోజున కూడా సభ బ్లాక్ డే చూసిందని, తమ గొంతు కూడా వినాలని పేదలు, బలహీనులు భావించిన రోజే నిజమైన ప్రజాస్వామ్యమని ఆయన చెప్పారు.
విపక్ష ఎంపీలు సభలో మాట్లాడేందుకు ప్రయత్నించిన ప్రతి సారీ స్పీకర్ నుంచి వద్దు.. వద్దు.. వద్దు అన్న మాటలే పదేపదే వస్తాయని ఆయన చెప్పారు. విపక్ష సభ్యుల ప్రసంగాలకు అడ్డు తగలడం సభలో నిత్యకృత్యంగా మారిపోయిందని జేఎంఎం ఎంపీ విజయ్ కుమార్ హన్స్దక చెప్పారు. అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని తెలిసినా పార్లమెంట్లో ప్రజాస్వామిక హక్కుల గురించి తమ ఆందోళనపై చర్చించే అవకాశాన్ని తాము కోరుకున్నామని ఎన్సీపీ(ఎస్పీ) ఎంపీ బజరంగ్ చెప్పారు.
More Stories
ఇరాన్ డ్రోన్లపై ఉక్రెయిన్ ను ఖాతరుచేయక ఇబ్బందుల్లో అమెరికా
ఫారూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం!
పానిపట్ లోఆర్ఎస్ఎస్ ప్రతినిధి సభలు రేపటినుండే!