భారత్ ను దూరం పెట్టి పాకిస్తాన్‌కు ట్రంప్ ప్రాధాన్యం ఇవ్వడం భారీ తప్పిదమని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాకన్నా పాకిస్తాన్‌కు కొన్నిసార్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌లతో ట్రంప్ సమావేశమవడంపై స్పందిస్తూట్రంప్ తీరును తప్పుబట్టారు.
భారత్‌తో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి సరికాదని పేర్కొంటూ ‘‘ట్రంప్ అనుసరిస్తున్న విదేశాంగ విధానానికి నేనేమీ అభిమానిని కాదు. ఈ విషయంలో ట్రంప్ చేస్తున్న అతిపెద్ద తప్పిదం భారత్ ను తక్కువగా చూడటం. టారిఫ్‌లతో భారత్ ను ఇబ్బంది పెడుతున్నారు. అలాగే పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని చెబుతారు” అంటూ మండిపడ్డారు.
“పైగా ఇటీవల వైట్‌హౌజ్‌లో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు ఆతిథ్యం ఇచ్చారు. భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు. భారత్ ను కాదని పాకిస్తాన్‌కు ప్రాధాన్యమివ్వడం తప్పు’’ అని టోనీ అబాట్ స్పష్టం చేశారు. భారత్ విషయంలో అమెరికా అనవసరంగా ఈ వైఖరి పాటిస్తున్నట్లుందని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
ఇరాన్ సంక్షోభంపై కూడా ఆయన ప్రస్తావిస్తూ ‘‘ఇరాన్లో పాలన మారుతుందో లేదో కచ్చితంగా చెప్పలేం. ఇరాన్‌లోని అనేకవర్గాలపై ఇప్పటి పాలకులకు ఉన్న పట్టును మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఏదేమైనా ఇస్లామిక్ పరిపాలనే ఉంటుంది. అయితే, ఎలాంటి ప్రభుత్వం కొనసాగినా ఇరాన్ ఇప్పటిదాకా అనుసరించిన దూకుడు వైఖరి ఉండదనుకుంటున్నాను’’ అని టోనీ అబాట్ పేర్కొన్నారు.

More Stories
ఇరాన్‌పై గ్రౌండ్ ఆపరేషన్ కు ట్రంప్ సమాలోచనలు
పశ్చిమాసియా ఘర్షణలపై పీ-5 దేశాల భేటీకి రష్యా పిలుపు
భారత్, చైనా ప్రత్యర్థులు కాదు, భాగస్వాములు కావాలి