సిఎం రేవంత్ ఎదుట 130 మంది మావోయిస్టులు లొంగుబాటు

సిఎం రేవంత్ ఎదుట 130 మంది మావోయిస్టులు లొంగుబాటు
* తెలంగాణ స్టేట్ కమిటీ పూర్తిగా అంతర్ధానం
 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు శనివారం లొంగిపోయారు. వారిలో 125 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారుండగా,  మిగితా వారిలో తెలంగాణకు చెందిన వాళ్లు నలుగురు కాగా, ఒకరు ఎపికి చెందిన వారు. లొంగిపోయిన మావోయిస్టులు 124 ఆయుధాలను సిఎంకు అప్పగించారు.  లొంగిపోయిన వారిలో ఏఓబీ కీలకనేత చలసాని నవత. మావోయిస్టు నేతలు దేవ్‌జీ, బడే చొక్కారావు గన్‌మెన్‌లు ఉన్నారు. 124 తుపాకులతో లొంగిపోగా, వీటిలో 31 ఏకే 47 తుపాకులున్నాయి.
 
అనంతరం సిఎం మీడియాతో మాట్లాడుతూ  లొంగిపోయిన మావోలు మంచి జీవితం గడిపేలా ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయేలా పోలీసులు కృషి చేశారని కొనియాడారు. పోలీసులు నక్సలైట్లలో ఓ నమ్మకాన్ని కల్పించారని తెలిపారు. ఈ సందర్భంగా డిజిపి శివధర్ రెడ్డి, డిజిపి సుమతిలను ఆయన అభినందించారు.
 
అణ్వాయుధాలు ఉన్న దేశాలు కూడా ఇవాళ చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటున్నాయని చెబుతూ ఇంకా అజ్ఞాతంలో ఉన్న నక్సలైట్లకు విజ్ఞప్తి చేస్తున్నానని, ప్రజలతో మమేకమై కలిసి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. దేవ్‌జీ, ఆయన మిత్ర బృందం కొన్ని ప్రతిపాదనలు చేశారని, తమ సమస్యలను పరిష్కరిస్తే లొంగిపోతామని చెప్పారని తెలిపారు. 
 
రాష్ట్రస్థాయిలో తాము చేయగలిగింది చేస్తామని నక్సలైట్ నేతలు చెప్పానని, నక్సలైట్ నేతల డిమాండ్లను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చర్చించానని, లొంగిపోయిన వారి మెరుగైన జీవితానికి హామీ ఇవ్వాలని అమిత్ షా సూచించారని పేర్కొన్నారు. అమిత్ షాతో చర్చల తర్వాత నక్సలైట్ నేతలతో మళ్లీ చర్చించానని పేర్కొంటూ లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస ప్యాకేజీతో పాటు ఆరోగ్య భద్రత కార్డు కల్పిస్తామని సిఎం హామీ ఇచ్చారు. 
 
నిమ్స్ వంటి ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు పొందే ఏర్పాట్లు చేస్తున్నామని,  మావోయిస్టుల హోదాలను బట్టి ప్యాకేజీ కల్పిస్తామని చెప్పారు. ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో భూమి లభ్యత కష్టంగా ఉన్నందున భూమి ఇవ్వటంపై హామీ ఇవ్వలేనని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హింసకు తావులేదు.. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే సహించేదని లేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
“అజ్ఞాతంలో ఉన్న గణపతితో సహా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గణపతికి ఆరోగ్యం బాగా లేదని తెలిసింది. ఆయన కూడా లొంగిపోవాలి. గణపతి లొంగిపోతే ఆయనకు రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తున్నా. సెంట్రల్‌ కమిటీ, స్టేట్‌ కమిటీలో ఉన్న వాళ్లు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి. అందరూ కలిసి వస్తే తెలంగాణను పునర్నిర్మించుకుందాం. గూడేలు, తండాల్లో ఉన్నవారి మెరుగైన జీవితానికి కృషి చేద్దాం. ఆదివాసీ, గిరిజనుల ఆర్థికస్థోమత పెరిగేలా మేం కృషి చేస్తున్నాం” అని ముఖ్యమంత్రి పిలుపిచ్చారు.
అజ్ఞాతం వీడి 130 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారని డిజిపి శివధర్ రెడ్డి తెలిపారు. ఆయుధాలతో సహా 130 మంది మావోయిస్టులు లొంగిపోయారని పేర్కొన్నారు. సిఎం రేవంత్ రెడ్డి, డిజిపి శివధర్ రెడ్డి సమక్షంలో 124 ఆయుధాలు మావోయిస్టులు అప్పగించారు. మావోయిస్టు అగ్రనేత అసలెవరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీకి చెందిన పిఎల్ జిఎ కమిటీ మొత్తం లొంగిపోయిన్నట్లు చెప్పారు.
 
గత నాలుగైదు నెలల్లోనే సుమారు 250 మంది మావోయిస్టులు లొంగిపోయారని, లొంగిపోయిన వాళ్లలో ముగ్గురు స్టేట్ కమిటీ స్థాయి ఉన్నవాళ్లు, వాళ్లలో ఒకరు రీజనల్ కమిటీ స్థాయి ఉన్నవాళ్లు,10 డివిజన్ కమిటీ స్థాయి ఉన్నవాళ్లు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 76 మంది దళసభ్యులు, లొంగిపోయిన వారిలో చాలా మంది సెంట్రల్ కమిటీ వద్ద స్టాఫ్ గా పనిచేసిన వాళ్లు ఉన్నారని వివరించారు.  తాజా లొంగుబాటుతో తెలంగాణ స్టేట్ కమిటీ పూర్తిగా అంతర్ధానం అయ్యిందని, ఇప్పుడు తెలంగాణ స్టేట్ కమిటీ అనేది ఇక లేదని డిజిపి శివధర్ రెడ్డి పేర్కొన్నారు.