అంతర్జాతీయ సమాజ దృష్టిని ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాన్ని తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. తొమ్మిది అంశాలతో కూడిన నగరాలను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రయివేటు రంగంలో శాటిలైట్లను కూడా తయారు చేసి లాంచ్ చేసేలా ఓ స్పేస్ సిటీని, డ్రోన్ల కోసం డ్రోన్ సిటీని, ఆవిష్కరణల కోసం క్రియేటివ్ సిటీని నెలకొల్పుతున్నామని చెప్పారు.
న్యూఢిల్లీలోని భారతమండపంలో ‘రైసినా డైలాగ్’ పేరిట శనివారం నాడు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా జనాభా వృద్ధిపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరముందని తెలిపారు. ప్రజల దృకోణాన్ని కూడా మార్చేందుకు చర్యలు చేపట్టి..సంతాన సాఫల్యత రేటును పెంచాల్సిన అవసరముందని తెలిపారు.
ఒక ప్రజాప్రతినిధిగా గతంలో తాను కూడా జనాభా నియంత్రణ గురించి మాట్లాడానని, అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆయన చెప్పారు. గతంలో పెద్ద కుటుంబ వ్యవస్థలు ఉండేవని, దేశానికి అదో పెద్ద ఆస్తి కూడా అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం పెద్ద కుటుంబాలు కనుమరుగై..మైక్రో ఫ్యామిలీలే మిగిలాయని చెప్పారు.
అందువల్ల ఏజింగ్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న దేశాలు తక్షణమే జనాభా నిర్వహణపై దృష్టి సారించాలని సూచించారు. సంతాన సాఫల్యత రేటు 1.5 నుంచి 2.1కు పెరిగేలా తాము చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మూడో బిడ్డ పుడితే రూ.25 వేల ఆర్ధిక సాయం, నెలకు రూ.వెయ్యి చొప్పున ఆర్థిక సాయం, విద్యా తదితర ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ప్రకటించామని చంద్రబాబు చెప్పారు.
కృత్రిమ మేథతో సమూల మార్పులు రాబోతున్నాయని చంద్రబాబు చెప్పారు. ఎఐ, క్వాంటం కంప్యూటింగ్ ఇప్పుడు గేమ్ చేంజర్లు అని, వాటిని వినియోగించే తీరును అనుసరించే భవిష్యత్ ఉంటుందని తెలిపారు. తమ రాష్ట్రంలో గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని పేర్కొన్నారు. అమరావతిని క్వాంటం వ్యాలీగా మారుస్తున్నామని, త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను కూడా తయారు చేసి ప్రపంచానికి అందిస్తామని చెప్పారు.
అమరావతిని బ్లూ, గ్రీన్ సిటీగా నిర్మించనున్నామని, మౌలిక సదుపా యాలను, సాంకేతికతను మిళితం చేసి కాలుష్య రహితంగా పర్యావరణహితంగా అమరావతిని తీర్చిదిద్దుతామని తెలిపారు. అలాగే అమరావతిలో అంతర్జాతీయ నాయకత్వ కేంద్రం (గ్లోబల్ లీడర్షిప్ సెంటర్) కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. పర్యావరణహితమైన గ్రీన్ అమ్మోనియా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. పరస్పరం సహకరించుకునే సహకారయుత సమాఖ్య విధానంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

More Stories
శాశ్వత రాజధానిగా అమరావతి బిల్లుకు బిజెపి స్వాగతం
అమరావతి చట్టబద్ధతకు శాసనసభ ఏకగ్రీవ తీర్మానం
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో మరో ఆరుగురు అరెస్టు