భవిష్యత్తు మహిళలదైతే… ఆ భవిష్యత్తు ఇప్పుడే ప్రారంభం

భవిష్యత్తు మహిళలదైతే… ఆ భవిష్యత్తు ఇప్పుడే ప్రారంభం
భవిష్యత్తు మహిళలదైతే… ఆ భవిష్యత్తు ఇప్పుడే ప్రారంభమైందని బిజెపి ఎంపీ బన్సూరి స్వరాజ్ తెలిపారు. బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొంటూ మహిళా శక్తి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం కేవలం ఒక కార్యక్రమంగా మిగిలిపోకూడదని, వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేయాలంటే వారి ద్వారానే సాధ్యమని స్పష్టం చేశారు.
 
మహిళలు స్వయంసాధికారత, డిజిటల్ సాక్షరత, ఆర్థిక అవగాహన పెంపొందించుకోవాలని, రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొనాలని ఆమె  పిలుపునిచ్చారు. మహిళలు ముందుకు వస్తేనే వికసిత భారత్ సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. మహిళా శక్తి సమాజానికి ఐశ్వర్యానికి ప్రతీక అని ఆమె చెప్పారు.  స్త్రీ బాలికగా ఉన్నప్పుడు మంగళకరంగా, కాళీగా చెడును అంతం చేసే శక్తిగా, దుర్గగా పరాక్రమానికి ప్రతీకగా, సరస్వతిగా జ్ఞానానికి ప్రతిరూపంగా భావిస్తామని ఆమె తెలిపారు.  
 
స్వయం సహాయక సంఘాలు దేశంలో సామాజిక విప్లవంగా మారాయని, మూడు కోట్ల “లఖ్‌పతి దీదీలు” లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని  బన్సూరి స్వరాజ్ తెలిపారు. తెలంగాణలో మహిళలు తయారు చేసిన మిల్లెట్ కుకీస్ విదేశాలకు ఎగుమతి కావడం, సంగారెడ్డి జిల్లాలో మహిళలు డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయంలో పనిచేయడం మహిళల సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

 
ప్రతి మహిళ ఒక సామాజిక విప్లవం, ఒక రాజకీయ విప్లవం, ఒక ఆర్థిక విప్లవం అని పేర్కొంటూ నారీశక్తి బలంతోనే వికసిత భారత్ సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో మహిళా సాధికారతను దాటి మహిళా ఆధారిత అభివృద్ధి దిశగా భారత్ ముందుకు సాగుతోందని ఆమె తెలిపారు. మహిళల గౌరవం, అవకాశాలు, ఆర్థిక సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని ఆమె వివరించారు.
 
 మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. మేకల శిల్పారెడ్డి మాట్లాడుతూ మహిళ అంటే గౌరవం, అభిమానం అని భావించే ప్రతి ఒక్కరూ మహిళా దినోత్సవాన్ని పండుగలా జరుపుకోవాలని కోరారు. మహిళలు బలంగా నిలబడితేనే కుటుంబం బలపడుతుందని, కుటుంబం బలపడితేనే సమాజం బలపడుతుందని, సమాజం బలపడితేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని ఆమె పేర్కొన్నారు.
 
విశిష్ట అతిథులుగా బీజేపీ ఎంపీ, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ, బిజెపి సీనియర్ నాయకురాలు బంగారు శృతి హాజరై మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.