వాట్సప్‌చాట్‌ల్లో క్రూరత్వం ఆధారంగా విడాకులు ఇవ్వలేం

వాట్సప్‌చాట్‌ల్లో క్రూరత్వం ఆధారంగా విడాకులు ఇవ్వలేం
జీవితభాగస్వామికి ఖండించే అవకాశం కూడా లేకుండా కేవలం వాట్సప్‌చాట్‌ల్లో క్రూరత్వం ఆధారంగా విడాకులు మంజూరు చేయలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. కుటుంబ కోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ, హైకోర్టును ఆశ్రయించిన మహిళ పిటిషన్‌పై ధర్మాసనం పైవిధంగా స్పందించింది.  తన వాదనను వినిపించేందుకు లేదా వ్యతిరేకించేందుకు తనకు అవకాశం ఇవ్వలేదని ఆ మహిళ పిటిషన్‌లో పేర్కొంది.
భర్త సమర్పించిన సాక్ష్యాలను (వాట్సప్‌ చాట్‌లను) తోసిపుచ్చడానికి భార్యకు అవకాశం ఇవ్వడంలో కుటుంబకోర్టు విఫలమైందని జస్టిస్‌ భారతి దాంగ్రే, జస్టిస్‌ మంజుషా దేశ్‌ పాండేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.  కేవలం వాట్సప్‌ చాట్‌ మీద ఆధారపడి, విడాకులను మంజూరు చేయలేమని నాసిక్‌ జిల్లా కుటుంబ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను గతవారం ధర్మాసనం కొట్టివేసింది.
భార్య వాదనలు వినిపించడానికి, సాక్ష్యాలను సమర్పించడానికి అవకాశం కల్పించడానికి ఈ కేసును తిరిగి కుటుంబ కోర్టుకు అప్పగించాలని ధర్మాసనం ఆదేశించింది. మధ్యవర్తిత్వం ద్వారా కేసును పరిష్కరించేందుకు గత అవకాశాలను కూడా పరిశీలించాలని ధర్మాసనం పేర్కొంది. విడాకులు కోరుతూ మహిళ భర్త తమ వాట్సప్‌ చాట్‌ను కుటుంబ కోర్టుకు సమర్పించారు. మహిళ తమ నివాసాన్ని నాసిక్‌ నుండి పూణెకు మార్చాలని, విడిగా ఉండాలని డిమాండ్‌ చేసిందని పేర్కొన్నారు.
ఆమె తన అత్తగారు, వదినపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. ఆ మహిళ తన వాట్సప్‌ చాట్‌లో భర్తపై ఒత్తిడి తీసుకువచ్చిందని, భావోద్వేగంతో బ్లాక్‌మెయిల్‌ చేసిందని, అసభ్యకరమైన భాషను వినియోగించిందని .. దీంతో భర్తపై క్రూరత్వం చూపినందున అతను విడాకులకు అర్హుడని కుటుంబ కోర్టు తీర్పునిచ్చింది.