* ఇరాన్ “నాయకత్వ సముదాయం” భవనంపై ఇజ్రాయిల్ దాడి
అమెరికా-ఇజ్రాయిల్ సేనలు, ఇరాన్ దళాల మధ్య వరుసగా నాలుగో రోజు కూడా భీకర పోరు కొనసాగుతుంది. మరోవైపు హిజ్బొల్లా కూడా రంగంలోకి దిగడంతో మధ్యప్రాచ్యంలో భయానక వాతావరణం కన్పిస్తోంది. లెబనాన్ రాజధాని బీరుట్‌లోని హిజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ మంగళవారం పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది. అనేక నిర్మాణాలు ధ్వంసమయ్యాయి.
బీరుట్ దక్షిణ శివారు ప్రాంతంలో ఉన్న హిజ్బొల్లా టీవీ, రేడియో స్టేషన్ భవనాలపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో తీవ్ర నష్టం వాటిల్లింది. హెజ్బొల్లాకు చెందిన అల్-మనార్ టీవీ ప్రసారాలు సుమారు గంట పాటు నిలిచిపోయాయి. శివారు ప్రాంతాలను ఇజ్రాయిల్ ఆక్రమించుకుంది. అక్కడి ప్రజలను ఖాళీ చేయాలంటూ హుకుం జారీ చేసింది.
ఇరాన్‌పై తాము ఇంకా పూర్తిస్థాయిలో దాడులు చేపట్టలేదని, యుద్ధం ఇప్పుడే మొదలైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అసలైన దాడి ముందుందని చెప్పారు. తమ వద్ద అపరిమితంగా ఆయుధాలు పోగుపడి ఉన్నాయని, అవి ఇతర దేశాల కంటే మెరుగైనవని చెప్పారు. వాటితో ఎంతకాలమైనా విజయవంతంగా యుద్ధం చేయవచ్చని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ వైమానిక దళం రాత్రికి రాత్రే టెహ్రాన్‌లోని ఇరాన్ “నాయకత్వ సముదాయం”పై దాడి చేసిందని, మంగళవారం సైన్యం తెలిపింది. దాదాపు 100 యుద్ధ విమానాలు ఆ సముదాయంపై 250 బాంబులను పడవేసాయని, ఇజ్రాయెల్‌లో 12 మంది గాయపడ్డారని ఐడిఎఫ్ తెలిపింది. ఈ సముదాయంలో లక్ష్యంగా చేసుకున్న భవనాల్లో ఇరాన్ అధ్యక్ష బ్యూరో, ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం, సమావేశాల కోసం ఇరాన్ “అత్యంత సీనియర్ ఫోరమ్” ఉపయోగించే సమ్మేళనం, “ఇరాన్ సైనిక అధికారులకు శిక్షణ ఇచ్చే సంస్థ” ఉన్నాయి.
మరోవైపు ఇరాన్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలపై అమెరికా-ఇజ్రాయిల్ సేనలు జరిపిన వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన 160 మంది అమాయక బాలికలను సాముహికంగా ఖననం చేశారు. వైమానిక దాడిలో బాలికల శరీరాలు ఛిద్రమై పోయాయి. యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి చెందిన ఏడు ఎమిరేట్స్‌లో ఒకటైన ఫుజైరాలోని చమురు కేంద్రం నుంచి అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
అంతకుముందు చమురు కేంద్రం పైకి దూసుకొచ్చిన డ్రోన్‌ను భద్రతా దళాలు అడ్డుకున్నాయి. అయినప్ప టికీ శకలాలు చమురు పరిశ్రమ జోన్‌లో పడడంతో మంటలు వ్యాపించాయి. ఇరాన్ సైనిక, ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు జరపగా ఇరాన్ కూడా ప్రతీకార దాడులు జరిపింది. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులు చేసింది.
దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో సంక్షోభం తీవ్రతరమైంది. భూతల దాడులు జరిపే అవకాశాన్ని తోసిపుచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. దీర్ఘకాల పోరుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇజ్రాయిల్ మాత్రం భూతల దాడులు ఆచరణ సాధ్యం కావని చెప్పింది. ఇరాన్ అటు ఇజ్రాయెల్‌తోపాటు ఇటు అరబ్ గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగించింది.
మంగళవారం సౌదీ రియాద్‌లోని అమెరికా ఎంబసీపై, ఇరాక్‌లోని ఎర్బిల్‌లో ఉన్న అమెరికా మిలటరీ స్థావరంపై డ్రోన్ దాడులు చేసింది. బహ్రెయిన్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఎయిర్‌బేస్ మెయిన్ కమాండ్ భవనం ధ్వంసమైంది. ఖతార్‌లోని దోహాలో మంగళవారం రాత్రి భారీస్థాయిలో పేలుళ్లు వినిపించాయి.
ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్‌లో మృతుల సంఖ్య 12కు పెరిగింది. సెంట్రల్ ఇజ్రాయెల్, టెల్ అవీవ్‌లో పలుచోట్ల మంగళవారం ఇరాన్ క్షిపణులు విధ్వంసం సృష్టించాయి. 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన అమెరికా సైనికుల సంఖ్య ఆరుకు పెరిగింది.
ఇరాన్ నూతన రక్షణ మంత్రి మృతి!
ఇరాన్ నూతన రక్షణ మంత్రి సయ్యద్ మాజిద్ ఎబ్ అల్ రెజా తమ వైమానిక దాడుల్లో మరణించారని ఇజ్రాయెల్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో రక్షణ మంత్రి అమీర్ నసీర్‌జాదే మరణించిన నేపథ్యంలో.. మాజిద్ అల్ రెజా సోమవారమే రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. అయితే మాజిద్ అల్ రెజా మృతి అంశంపై ఇరాన్ నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.
మరోవైపు ఒత్తిడికి తలవంచబోమని, అయితే చర్చలకు సిద్ధంగానే ఉన్నామని ఇరాన్ తెలిపింది. అమెరికా-ఇజ్రాయిల్ దళాలు జరుపుతున్న దాడులలో మరణించిన వారి సంఖ్య 787కు చేరింది. కెర్మన్ రాష్ట్రంలో జరిగిన దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన 13 మంది చనిపోయారు. దాడులతో భీతిల్లుతున్న ఇరాన్ ప్రజలను తాజాగా భూ ప్రకంపనలు వణికించాయి. దక్షిణ ప్రాంతంలోని గెరాష్ సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూమి కంపించింది.
ఇజ్రాయిల్ సేనలు ముందుకు సాగుతుండడంతో సరిహద్దుల వద్ద లెబనాన్ ప్రభుత్వం దళాల మోహరింపును పెంచింది. లెబనాన్‌లో మరిన్ని స్థావరాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సైన్యానికి అధికారం ఇచ్చారు. సరిహద్దున ఉన్న ప్రజలపై కాల్పులు జరగకుండా నివారించడానికే ఈ చర్య తీసుకున్నామని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి కట్జ్ చెప్పారు. లెబనాన్‌లోని హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయిల్ సేనలు విరుచుకుపడుతున్నాయి.
ఇదిలావుండగా ఫ్రాన్స్‌లోని అక్రోటిరిలో ఉన్న బ్రిటీష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) స్థావరంపై ఇరాన్ డ్రోన్లు దాడి చేశాయి. దీంతో సైప్రస్‌కు క్షిపణి, డ్రోన్ నిరోధక వ్యవస్థలను పంపాలని ఫ్రాన్స్ యోచిస్తోంది. ఒమన్‌లోని ఓ ఓడరేవులో ఉన్న ఇంధన ట్యాంకులపై కూడా ఇరాన్ డ్రోన్లను ప్రయోగించింది. ఖతార్‌లోని ఇజ్రాయిల్, అమెరికా సైనిక స్థావరంపై కూడా ఇరాన్ దాడులు చేసింది.
త్రివిధ దళాలకు చెందిన విధ్వంసక డ్రోన్లు ఆక్రమిత ప్రాంతాలలోని ఇజ్రాయిల్ సైనిక ప్రాంతాలను, అల్-ఉదెయిద్‌లోని అమెరికా దళాల స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని ఇరాన్ సైన్యం తెలిపింది. ఇరాన్ అధ్యక్ష కార్యాలయాన్ని, సెక్యూరిటీ కౌన్సిల్ భవనాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని ఇజ్రాయిల్ చెప్పింది. వాటిపై భారీగా ఆయుధాలు ప్రయోగించి ధ్వంసం చేశామని తెలియజేసింది. సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై కూడా ఇరాన్ రెండు డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఆ భవనం స్వల్పంగా దెబ్బతిన్నది.

More Stories
సున్నీ, షియా ముస్లింల మధ్య ప్రధాన తేడాలేంటి?
నాలుగు రోజుల యుద్ధానికే క్షీణిస్తున్న ఆయుధ సంపత్తి
ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని ఇప్పుడే చెప్పలేం