48 గంటల్లో 8 పశ్చిమాసియా దేశాధినేతలతో మాట్లాడిన మోదీ

48 గంటల్లో 8 పశ్చిమాసియా దేశాధినేతలతో మాట్లాడిన మోదీ
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్‌ దేశాలపై దాడులు జరగడంపై ప్రధాని నరేంద్రమోదీ  గత 48 గంటల్లో 8 పశ్చిమాసియా దేశాల అధినేతలతో మాట్లాడారు. యూఏఈ, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, జోర్దాన్, బహ్రెయిన్, ఒమన్, కువైట్, ఖతార్ నాయకులతో మాట్లాడారు. అటు కేంద్ర విదేశాంగ శాఖ కూడా ఆందోళ వ్యక్తం చేసింది. 
మరోవైపు పశ్చిమాసియాలో వేగంగా మారుతున్న పరిణామాలను నిశితంగా గమనించేందుకు అంతర మంత్రిత్వ బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ బృందం ప్రతిరోజూ సమావేశమై పరిస్థితులను సమీక్షిస్తోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్ మంగళవారం వెల్లడించారు.  మంగళవారం మధ్యాహ్నం ఒమన్‌ సుల్తాన్‌ హైతామ్‌ బిన్‌ తారిక్‌, కువైట్‌ యువరాజు షేక్‌ సబాహ్‌ అల్‌ ఖలేద్‌, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్‌ అల్ థానీతో ప్రధాని ఫోన్‌లో మాట్లాడారు.
ఒమన్, కువైట్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం, భద్రతా అంశాలపై ప్రధాని మోదీ చర్చించారు. గత రెండు రోజుల్లో మొత్తం 8 దేశాధినేతలతో చర్చలు జరిపారు.  పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై విదేశాంగ శాఖ కూడా తీవ్ర ఆందోళ వ్యక్తం చేసింది. పవిత్ర రంజాన్ మాసంలో గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి దిగజారడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రకటనను విడుదల చేసింది. ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చడంతో పాటు ఇతర దేశాలకు కూడా విస్తరించిందని తెలిపారు. 
 
అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు పెరగకుండా నివారించాలని, పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని భారత్ కోరినట్లు తెలిపింది. గల్ఫ్ ప్రాంత భద్రత, స్థిరత్వంలో కీలక వాటా కలిగిన సమీప పొరుగు దేశంగా ఈ పరిణామాలు తమకు ఆందోళన కలిగిస్తున్నాటని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.  గల్ఫ్ ప్రాంతంలో దాదాపు కోటిమంది భారతీయులు ఉన్నారనీ వారి భద్రత, శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించింది.
భారతదేశ వాణిజ్యం, ఇంధన సరఫరా గొలుసులు ఈ ప్రాంతంపై ఆధారపడి ఉన్నాయన్న విదేశాంగశాఖ ఇక్కడి అంతరాయాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాలను చూపుతాయని తెలిపింది. వాణిజ్య ఓడలపై దాడులను ఖండిస్తున్నామని, ఇప్పటికే పలువురు భారతీయులు మృతిచెందారని వివరించింది. గత కొన్ని రోజుల్లో జరిగిన దాడుల్లో కొందరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు కనిపించకుండా పోయారని విచారం వ్యక్తం చేసింది.