ఇరాన్, ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధం ప్రభావంతో ముడి చమురు ధరలు దాదాపు 10 శాతం పెరిగాయి. ఒక బ్యారెల్ ముడి చమురు ధర రూ.7,169 (78.52 డాలర్ల)కి చేరింది. ఈ సైనిక ఘర్షణ పరిమిత స్థాయిలోనే కొనసాగినా, త్వరలోనే బ్యారెల్ ముడి చమురు ధర రూ.9,100 – రూ.10,500 రేంజుకు పెరగొచ్చని మార్కెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఒకవేళ సముద్ర మార్గంలో ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలకు అవాంతరం వాటిల్లే స్థాయికి సైనిక ఘర్షణ తీవ్రతరమైతే, బ్యారెల్ ముడి చమురు ధర రూ.11,000 – రూ.13,000 రేంజుకు పెరుగుతుందని అంటున్నారు. ఈ యుద్ధంలోకి మరిన్ని దేశాలు దిగి, దీర్ఘకాలం పాటు సైనిక ఘర్షణ కొనసాగే పరిస్థితులు ఏర్పడితే బ్యారెల్ ముడి చమురు రేటు రూ.14వేలు దాటే ముప్పు ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
చాలా అరబ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైనా ఇరాన్ మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈనేపథ్యంలో ఆయా అరబ్ దేశాల నుంచి సముద్ర మార్గంలో ముడి చమురు సరఫరాకు విఘాతం కలుగుతోంది. ప్రస్తుతం హార్ముజ్ మీదుగా ఆసియా దేశాలకు ముడి చమురును అరబ్ దేశాలు రవాణా చేయలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు ముడి చమురు ధరలు పెరిగాయి.
ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ సైనిక ఘర్షణ కొనసాగినన్ని నాళ్లు క్రూడ్ ఆయిల్ రేట్లు పైపైకే వెళ్తాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. గత శుక్రవారం (ఫిబ్రవరి 27) నాటికి ఒక బ్యారెల్ ముడి చమురు ధర రూ.6,121 (67 డాలర్లు) మాత్రమే ఉంది. రెండు రోజుల్లోనే అది 7.3 శాతం పెరిగి రూ.7,169కి చేరింది. ఈ పెరిగిన ధరల ప్రభావం వాహనదారులపై పడనుంది. ప్రత్యేకించి సరుకు రవాణా రంగంపై ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది.
సరుకు రవాణా ఛార్జీలు పెరిగితే, నిత్యావసరాల రేట్లు కూడా పెరిగిపోతాయి. చివరకు ఈ ధరాభారాన్ని సామాన్య ప్రజలే భరించాల్సి వస్తుంది. వెరసి, దేశంలో మళ్లీ ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. కాగా, ‘‘ఒపెక్ దేశాలు ముడి చమురు ఉత్పత్తిని పెంచనుండటం సానుకూల అంశం. అవి ఉత్పత్తిని పెంచాక, ప్రత్యామ్నాయ మార్గాల్లో అన్ని దేశాలకు ఆయిల్‌ను సప్లై చేస్తాయి. దీనివల్ల మళ్లీ చమురు రేట్లు తగ్గిపోతాయి. ఇది ప్రజలకు ఉపశమనం కలిగించే అంశం’’ అని నార్వేకు చెందిన ఇంధన రంగ విశ్లేషకులు జార్జ్ లియోన్ పేర్కొన్నారు.
ఇరాన్ – అమెరికా సైనిక ఘర్షణ మొదలయ్యాక ముడి చమురును సరఫరా చేసే ఆయిల్ ట్యాంకర్ల బీమా ప్రీమియంలను భారీగా పెంచడంతో చమురు రవాణా ఛార్జీలు చుక్కలను అంటాయి.

More Stories
ఎఐ భద్రతా నియమాలపై అమెరికాలో మాటల యుద్ధం
దేశ ఆర్థిక వ్యవస్థ 7-7.4 శాతం వృద్ధి రేటు
మద్యం పాలసీ కేసు విచారణలో సీబీఐ వేరు, ఈడీ వేరు