విశ్రాంత ఉద్యోగుల బకాయిల చెల్లింపుకై బిజెపి ఆధ్వర్యంలో ధర్నా

విశ్రాంత ఉద్యోగుల బకాయిల చెల్లింపుకై బిజెపి ఆధ్వర్యంలో ధర్నా
విశ్రాంత ఉద్యోగులు, ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్-ధర్నా చౌక్ వద్ద  తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం దీక్ష నిర్వహించారు.

నిరాహార దీక్షకు సంఘీభావంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ధర్నా చౌక్‌కు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా విశ్రాంత ఉద్యోగులు చేస్తున్న నినాదాలతో ధర్నా చౌక్ దద్దరిల్లింది. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులు గళమెత్తారు. బకాయిల చెల్లింపులో జరుగుతున్న జాప్యం వల్ల ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఆర్థికంగా, మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 

 
ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ నిరాహార దీక్షలో బీజే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల హక్కుల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా బీజేపీ స్పష్టం చేసింది.

రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షత వహిస్తూ  కాంగ్రెస్ పాలనలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నమోదయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ఆర్థిక ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారని, మరికొందరు సరైన వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కారు నిర్లక్ష్యం ఉద్యోగుల జీవితాలను బలి తీసుకుంటోందని ధ్వజమెత్తారు.

ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారని చెబుతూ అసలు ఆయనకు తెలంగాణకు వచ్చే నైతిక అర్హతే కోల్పోయారని మండిపడ్డారు. ఎందుకంటే వాళ్ల పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో పేదల ఇండ్లు కూలగొడుతున్నారని, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు సహా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు.


పేదల మీద, ఉద్యోగుల మీద, రైతుల మీద జరుగుతున్న ఈ దారుణమైన అణచివేతకు ఇక ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. ప్రజల హక్కులను కాలరాస్తూ, బలవంతపు కూల్చివేతలతో భయాందోళన సృష్టిస్తున్న ఈ కాంగ్రెస్ గడ్డపార రాజ్యాన్ని కూలగొట్టాల్సిందే అని తేల్చి చెప్పారు.