ఇకపై హార్డ్‌వేర్ రంగంలోనూ భారత్ సత్తా

ఇకపై హార్డ్‌వేర్ రంగంలోనూ భారత్ సత్తా

గ్లోబల్ టెక్నాలజీ వాల్యూ చైన్‌లో భారత్ వేగంగా భాగం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల వాణిజ్యంలో భారత్‌ కీలక పాత్ర పోషించబోతుందని మోదీ వెల్లడించారు. గుజరాత్‌లోని సానంద్‌లో ఏర్పాటు చేసిన మైక్రాన్ టెక్నాలజీ సెమీకండక్టర్ ప్లాంట్‌ను ప్రధాని మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్తో కలిసి ప్రారంభించారు. 

అనంతరం నిర్వాహకులతో కలిసి ప్లాంట్ను సందర్శించారు.  ఈ ప్లాంట్‌కు సంబంధించిన ఎంవోయూ మూడేళ్ల కిందటే జరిగింది. ఇందులో అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్‌కు చెందిన పనులు జరుగుతాయని మోదీ తెలిపారు. అమెరికాకు చెందిన మైక్రాన్ టెక్నాలజీ రూ. 22,516 కోట్ల భారీ పెట్టుబడితో ఈ కేంద్రాన్ని నెలకొల్పినట్టు వెల్లడించారు. 

ఈ ప్లాంట్‌లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కావడం ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల వాణిజ్యంలో భారత్‌ పాత్రను బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. గత శతాబ్దాన్ని చమురు నియంత్రిస్తే ఈ శతాబ్దాన్ని సెమికండక్టర్లు నియంత్రిస్తాయని చెప్పారు. “10, 11 ఏళ్ల క్రితం భారత్‌లో ‘డేటా’, ‘చిప్స్’ గురించిన చర్చ కేవలం కొన్ని వర్గాలకే పరిమితమైంది. టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నప్పుడు మన చర్చలు ఎక్కువగా ఐటీ సేవల చుట్టూనే తిరిగేవి” అని గుర్తు చేశారు. 

“కానీ ఈరోజు చూడండి, సాఫ్ట్‌వేర్ రంగానికి పేరుగాంచిన భారత్ ఇప్పుడు ‘హార్డ్‌వేర్’ రంగంలో కూడా తన ఉనికిని చాటుకుంటూ శక్తిమంతంగా మారుతోంది. ఈరోజు సానంద్‌లో సరికొత్త భవిష్యత్తు ఆవిర్భవించడాన్ని మనం చూస్తున్నాం. మైక్రాన్ సంస్థకు చెందిన ఈ ఏటీఎంపీ ఫెసిలిటీలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం అనేది గ్లోబల్ టెక్నాలజీ వాల్యూ చైన్‌లో భారతదేశ పాత్రను మరింత బలోపేతం చేయనుంది” అని స్పష్టం చేశారు. 

నేడు భారత్‌ అత్యంత వేగంగా ‘గ్లోబల్ సెమీకండక్టర్ వాల్యూ చైన్’లో అంతర్భాగమవుతోందని మోదీ తెలిపారు. అలాగే ఒకప్పప్రపంచాన్ని చమురు నియంత్రించేదని, ఇప్పుడు మైక్రోచిప్ల కాలం నడుస్తుందని మోదీ పేర్కొన్నారు. “ఇది ఏఐ విప్లవ శతాబ్దం. ఈ విప్లవానికి సెమీకండక్టర్ అనేది ఒక వారధిలాగా పని చేస్తుంది. ప్రపంచాన్ని గత శతాబ్దంలో చమురు నియంత్రిస్తే, ఈ శతాబ్దాన్ని సెమీకండక్టర్లు నియంత్రిస్తాయి. ఇది ఆమెరికా- భారత్ మధ్య బలమైన సహకారం, భాగస్వామ్యాన్ని కూడా సూచిస్తుంది. ఇది అత్యంత కీలకమైంది” అని తెలిపారు.