గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ సర్కార్ ఆపసోపాలు

గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ సర్కార్ ఆపసోపాలు

ఐదు గ్యారెంటీల పేరిట అలవిగాని హామీలనిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలను అమలు చేయడానికి ఆపసోపాలు పడుతున్నది. ఐదు గ్యారెంటీల అమలు కష్టతరంగా మారిందంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మొదలు మంత్రుల వరకూ వీలు దొరికినప్పుడల్లా మీడియా ముందు మొర పెట్టుకోవడం నిత్యకృత్యమైంది. 

ఇప్పుడు ఆ జాబితాలోకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌ కూడా చేరిపోయారు. ‘ఐదు గ్యారెంటీల అమలు రాష్ట్ర ఖజానాపై పెను భారం మోపుతున్నది’ అంటూ ఆయన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. అయినప్పటికీ, ఎంత కష్టమొచ్చినా హామీల అమలును కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో ఆయన మాట్లాడుతూ మరణించిన వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. వాటిని నిలిపివేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. దీంతో డీకే వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. గ్యారెంటీలను ఎత్తివేయడానికి లేదా లబ్ధిదారుల్లో కోత విధించడానికి డీకే శివకుమార్‌ ఖజానాపై భారమవుతున్నదంటూ సాకులు చెప్తున్నారని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌ నేతలు విరుచుకుపడ్డారు.

గ్యారెంటీల నెపంతో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి ప్రాజెక్టును కూడా సర్కారు చేపట్టలేదని మండిపడ్డారు. సర్వత్రా విమర్శలు పెరుగుతుండటంతో సీఎం సిద్ధరామయ్య సహా మంత్రులు స్పందించారు. డీకే వ్యాఖ్యలను సమర్థిస్తూ ఖజానాపై భారం పడుతున్న మాట వాస్తవమైనప్పటికీ, గ్యారెంటీలను కొనసాగిస్తామని హామీనిచ్చారు.