లడ్డు వివాదంలో సుబ్రహ్మణ్య స్వామికి ఎదురుదెబ్బ

లడ్డు వివాదంలో సుబ్రహ్మణ్య స్వామికి ఎదురుదెబ్బ
తిరుమల కల్తీ నెయ్యి కేసులో సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన సీబీఐ సిట్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా పాలనాపరమైన చర్యలు తీసుకునేందుకుగాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీకి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏకసభ్య కమిటీ విచారణపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. దీనిపై బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. 
 
సిట్‌ దర్యాప్తు, ప్రభుత్వ విచారణల మధ్య వైరుధ్యం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
సిట్‌ దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం చేపట్టిన పరిపాలనా పరమైన విచారణపై ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది.  కల్తీ నెయ్యి వ్యవహారంలో పాలనాపరమైన చర్యలు తీసుకోవాలన్న సిట్‌ ప్రతిపాదన మేరకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దినేశ్‌ కుమార్‌ నేతృత్వంలో చంద్రబాబు ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. 
 
ఆ వ్యవహారం జరిగినప్పుడు టీటీడీలో, పాలకమండలిలో పనిచేసినవారిపై కమిటీ విచారణ జరపనుంది.  అయితే, కమిటీ విచారణను నిలిపివేయాలని కోరుతూ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో ఈ నెల 11న పిటిషన్‌ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్‌ ఉండగా, మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించడాన్ని ఆయన తన పిటిషన్‌లో సవాల్‌ చేశారు. కమిటీ ఏర్పాటు సుప్రీంకోర్టు గత ఆదేశాలను ఉల్లంఘించడమేనని వాదించారు. 
 
దీనివల్ల సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న సిట్‌ విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి పదే పదే భక్తులను తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదుచేశారు. ఏకసభ్య కమిటీ నియామకాన్ని రద్దు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సీఎం, సిట్‌, సీబీఐ, టీటీడీలను ప్రతివాదులుగా చేర్చారు. 
 
తిరుమల కల్తీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన దర్యాప్తు చేసుకోవచ్చని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.  ఆ పిటిషన్‌ సోమవారం చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌ మాల్యబాగ్చీలతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.
‘‘క్రిమినల్‌ విచారణ సిట్‌ పరిధిలోని అంశం. అయితే, పరిపాలనాపరమైన లోపాలు, నిర్లక్ష్యం లేదా క్రిమినల్‌ నిర్లక్ష్యానికి అవకాశం ఉండొచ్చు కదా? ఇవన్నీ ప్రభుత్వ యంత్రాంగం పరిధిలోకి వచ్చే అంశాలు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది.పిటిషనర్‌ లేవనెత్తిన అభ్యంతరాలకు ఆధారం కనిపించడం లేదు’’ అని బెంచ్‌ తెలిపింది. సిట్‌ దర్యాప్తు, ఏకసభ్య కమిటీ విచారణ రెండింటినీ చట్టానికి లోబడి కొనసాగించాలని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించింది.