ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల భారీ నిరసన

ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల భారీ నిరసన
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్‌లో ఆందోళనలు ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇరాన్‌లో వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కారు. ప్రభుత్వాధినేత ఖమేనీకి, అతడి పాలనకు వ్యతిరేకంగా శనివారం నినదించారు.  ఇరాన్ రాజధాని టెహ్రాన్, మషాద్ పట్టణాల్లో విద్యార్థులు, యువత వీధుల్లోకి చేరి నిరసనలు చేపట్టారు. 
సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేయాలని, అతడి పాలన నుంచి తమకు స్వేచ్ఛ కావాలని, అలాగే ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక షరీఫ్‌ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు.  ఈ క్రమంలో పోలీసులు, భద్రతా బలగాలపైకి దూసుకెళ్లారు. వారికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ ఉద్యమానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనల్లో వేల మంది మరణించారని అమెరికా సహా అంతర్జాతీయ హక్కుల సంఘాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. కానీ, వీటికి ఆధారాలు చూపాలని ఇరాన్ డిమాండ్ చేసింది.  అయితే, ఆందోళనల్లో పాల్గొన్న వేలాదిమందిని ఖమేనీ ప్రభుత్వం చంపిందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇరాన్‌పై అమెరికా దాడులకు సిద్దమవుతోంది. అవసరమైతే ఖమేనీని కూడా చంపాలని అమెరికా భావిస్తోంది.

గత నెలలో ఆర్థిక సమస్యల కారణంగా చెలరేగిన నిరసనలు 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత జరిగిన అతిపెద్ద ప్రదర్శనలుగా మారాయి. అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (హ్రానా) ప్రకారం, ఆ కాలంలో కనీసం 6,159 మంది మరణించారు, వీరిలో 5,804 మంది నిరసనకారులు, 92 మంది పిల్లలు,  214 మంది ప్రభుత్వ అనుబంధ వ్యక్తులు ఉన్నారు. మరో 17,000 మంది మరణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
 
ఇరాన్ అధికారులు 3,100 కంటే ఎక్కువ మంది మరణాలను అంగీకరించారు. వీరిలో ఎక్కువగా భద్రతా సిబ్బంది లేదా ప్రేక్షకులు ఉన్నారు. మరణాలకు “అల్లర్లు” కారణమని ఆరోపించారు. శనివారం నాటి నిరసనలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగాయి. బహిష్కృత ప్రతిపక్ష గ్రూపులు ట్రంప్ ఇరాన్ ప్రభుత్వంపై చర్య తీసుకోవాలని కోరగా, ఇతర వర్గాలు విదేశీ జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నాయి. 
ఇరాన్‌పై అమెరికా ఎప్పుడైనా మెరుపు దాడులకు దిగొచ్చని నేరుగా అమెరికా అధికారులే వెల్లడించారు.  అమెరికా దాడుల్ని ఎదుర్కోవడానికి ఇరాన్ కూడా సిద్దమవుతోంది. తమ దగ్గర ఉన్న ఆయుధాల్ని పరీక్షిస్తోంది. సైన్యాన్ని కూడా సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇరాన్‌లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.