రైతు వ్యతిరేక విధానాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వాపురం లక్ష్మి నర్సయ్య నాయకత్వంలో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా, వ్యవసాయపరంగా తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల సమస్యలను ఇకపై పట్టించుకోకుండా ఉంటే బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా తరఫున ఉద్యమాలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా నిధులను ఎకరాకు రూ.15,000 చొప్పున ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే విడుదల చేయాలని, రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేయడం మానేసి, రుణమాఫీ కాని రైతులందరికీ పూర్తిస్థాయిలో వెంటనే రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
యూరియా కొరతతో పంటలు ఎండిపోతున్న పరిస్థితిని ప్రభుత్వం గమనించి, రైతులకు యూరియా ఎరువులు నిరంతరంగా అందుబాటులో ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు చెల్లించాల్సిన బోనస్ డబ్బులను సంవత్సరాల తరబడి పెండింగ్‌లో పెట్టడం అన్యాయమని పేర్కొంటూ పెండింగ్ బోనస్ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు.
రాబోయే రబీ సీజన్‌లో వరి పంట కొనుగోలులో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ముందుగానే తగినన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఈ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయకపోతే, రైతుల పక్షాన బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ఉద్యమాలు చేపడుతుందని స్పష్టం చేశారు.

More Stories
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ సవాళ్లు, ప్రతిసవాళ్లు మధ్య ఉద్రిక్తత
జగిత్యాల జిల్లాలో కుల బహిష్కరణ అంటూ తప్పుడు ప్రచారం
డ్వాక్రా గ్రూపులకిచ్చే రుణాలు దేశం కోసం సురక్షితమైన పెట్టుబడి