భారత్- బ్రెజిల్ మధ్య వ్యూహాత్మక అవగాహన

భారత్- బ్రెజిల్ మధ్య వ్యూహాత్మక అవగాహన

* వచ్చే ఐదేళ్లలో 20 బిలియన్‌ డాలర్లకు మించి వాణిజ్య విస్తరణ 

భారత్- బ్రెజిల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధికి, అలాగే పర్యావరణ అనుకూల ఆర్థిక విధానాలను (గ్రీన్ ఫైనాన్స్) ప్రోత్సహించడానికి, క్రిటికల్ మినరల్స్‌ అంశంలో సహకారానికి ఇరు దేశాలు శనివారం ఒక వ్యూహాత్మక అవగాహనకు వచ్చాయి.  ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేశాయి.

బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆయన ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా భావిస్తున్న ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది.

ఇరు దేశాల్లోని ఎంఎస్ఎంఈలు సాంకేతికతను, మార్కెట్ వ్యూహాలను, ప్రభుత్వ విధానాలను పరస్పరం అర్థం చేసుకోవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. మారుతున్న పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా చిన్న పరిశ్రమలు తమను తాము మలుచుకోవడానికి, తక్కువ కాలుష్యంతో కూడిన ఉత్పత్తి విధానాలను అవలంబించడానికి ఈ ఒప్పందం సహకరిస్తుంది. 

పర్యావరణానికి మేలు చేసే ప్రాజెక్టుల కోసం ఎంఎస్ఎంఈలకు సులభంగా పెట్టుబడులు, రుణాలు అందేలా ఇరు దేశాలు కృషి చేస్తాయి. ఈ సహకారం వల్ల భారతీయ, బ్రెజిల్ ఎంఎస్ఎంఈలు అంతర్జాతీయ సరఫరా గొలుసులో భాగస్వాములు కావడానికి, తద్వారా వాటి ఉత్పాదకత, పోటీతత్వాన్ని పెంచుకోవడానికి అవకాశం లభిస్తుంది.

రాజకీయ ఉద్రిక్తతలు, ఎగుమతి ఆంక్షలతో ప్రపంచ సరఫరా వ్యవస్థ అతలాకుతలం అవుతున్న తరుణంలో కీలకమైన క్రిటికల్ మినరల్స్ వేటలో భారత్- బ్రెజిల్ తమ స్థానాలను పదిలం చేసుకునే దిశగా అడుగులు వేశాయి. కీలక ఖనిజాల కోసం కొన్ని దేశాలపైనే ఆధారపడటాన్ని తగ్గించి, అరుదైన ఖనిజాల విషయంలో స్వయంసమృద్ధి సాధించడమే లక్ష్యంగా ఇరు దేశాలు ఒక ఒప్పందం చేసుకున్నాయి.

 బ్రెజిల్ అధ్యక్షుడు లూలా చర్చల సందర్భంగా తమ దేశంలోని ఖనిజ నిల్వలపై వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు. బ్రెజిల్‌లో ఉన్న నిల్వల్లో కేవలం 30 శాతం మాత్రమే ప్రస్తుతం అన్వేషించినట్లు తెలిపారు. ఇంకా భారీ స్థాయిలో అన్వేషణకు అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఖనిజాల ప్రాసెసింగ్, వినియోగంలో భారత్ భాగస్వామ్యాన్ని బ్రెజిల్ ఆహ్వానించింది.

బ్రెజిల్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అరుదైన ఖనిజ నిల్వలను కలిగి ఉంది. ఆ దేశంలో సుమారు 2.1 – 2.2 కోట్ల టన్నులు క్రిటికల్ మినరల్స్ నిల్వలు ఉన్నాయి. చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి బ్రెజిల్ తన పరిశ్రమను వేగంగా అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్‌లో చైనా గుత్తాధిపత్యాన్ని చలాయిస్తోంది. బ్రెజిల్‌తో జతకట్టడం ద్వారా భారత్ ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను సృష్టించుకోవచ్చు.

భారత్‌, బ్రెజిల్‌ రెండు దేశాలు అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలు మాత్రమే గాక ఎంతో వైవిధ్యభరితమైన దేశాలన్నీ, ఇరు దేశాలు సాంస్కృతిక పరిశ్రమకు కేంద్రాలు అని బ్రెజిల్‌ అధ్యక్షులు లూలా ద సిల్వా అభివర్ణించారు. ఇప్పటికే ఐదు రంగాల్లో ద్వైపాక్షిక సహకార అజెండాను పునర్నిర్మించుకున్నామని, తాజాగా ఇరు దేశాల భాగస్వామ్యానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పలు ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు.

ఐటి, ఎఐ, బయోటెక్నాలజీ, అంతరిక్ష ప్రయోగాలు వంటి అత్యాధునిక రంగాల్లో భారత్‌ ఎంతో పురోగతి సాధిస్తోందని, ఇవి బ్రెజిల్‌కు ఎన్నో అవకాశాలు కల్పిస్తాయని లూలా ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తు కోసం డిజిటల్‌ భాగస్వామ్యంపైన, అరుదైన భూమి, ఖనిజాలు, ఉక్కు సరఫరా గొలుసులో మైనింగ్‌ రంగంలో సహకారం కోసం మూడు ఎంఓయులు కుదుర్చుకున్నట్లు ఇరువురు నేతలు ప్రకటించారు. 

వచ్చే ఐదేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 20 బిలియన్‌ డాలర్లకు మించి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా లూలా మాట్లాడుతూ  పునరుత్పాదక ఇంధన సూపర్‌ పవర్‌తో డిజిటల్‌ సూపర్‌ పవర్‌ సమావేశంగా తమ భేటీని అభివర్ణించారు. ఆరోసారి భారత్‌లో పర్యటిస్తుండటం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ  మాట్లాడుతూ..లాటిన్‌ అమెరికాలో భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా బ్రెజిల్‌ ఉందని తెలిపారు. లూలా స్ఫూర్తిదాయక నాయకత్వం, దార్శనికతతో ఇరు దేశాలు ప్రయోజనం పొందుతున్నాయని, ఇది విన్‌-విన్‌ భాగస్వామ్యమని ఆయన అభివర్ణించారు. రెండు దేశాలు కలిసి పనిచేస్తే వర్ధమాన ప్రపంచం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉగ్రవాదం, దానికి మద్దతిచ్చేవారు మానవాళికి శత్రువులని ఈ రెండు దేశాలు అంగీకరిస్తున్నాయని ప్రధాని చెప్పారు.