2022లో జరిగిన వైసిపి ఎమ్మెల్సీ అనంత బాబు (అనంత సత్య ఉదయ భాస్కర్) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. ఈ హత్య కేసులో వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కు అయ్యారని, అంతేకాకుండా ఆయనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేశారని విమర్శించింది.
డ్రైవర్ హత్యకేసులో దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కేసును విచారించింది. డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయస్థానం తెలిపింది. తప్పుచేసిన పోలీసులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. డీజీపీ, ఎస్పీలు ఏం చేస్తున్నారని నిలదీసింది. నిందితుడితో పోలీసులు ఇప్పటికీ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నంట్లుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
నవంబర్ 18లోపు విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టులను ఆదేశించింది. కేసు ట్రయల్ కోసం హైకోర్టు సీనియర్ న్యాయాధికారిని నియమించి రోజువారీ విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మార్చి 31లోగా ప్రత్యేక జ్యుడిషియల్ అధికారిని నియమించాలని, హైకోర్టు ఈ కేసులో జోక్యం చేసుకుని ఆటంకాలు సృష్టించవద్దని సూచించింది. తదుపరి దర్యాప్తు చేయడం రాకపోతే కేసును సీబీఐకి అప్పగించాల్సి వస్తుందని హెచ్చరించింది.
రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూత్రా వాదనలు వినిపిస్తూ 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పాలన మారిన తర్వాత, దర్యాప్తును తీవ్రంగా పరిగణించామని, బహుశా గత పాలనలో నిందితుడి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి ప్రభావం వల్లే దర్యాప్తు పట్టాలు తప్పిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిందితులకు, పోలీసులకు మధ్య సఖ్యత ఉండేదని వాదించారు.
దీనికి స్పందించిన సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ ”వారు ఉద్దేశపూర్వకంగా ఛార్జిషీట్ దాఖలు చేయలేదని మాకు అర్థమైంది” అని చెప్పారు. దీంతో వెంటనే జోక్యం చేసుకున్న సీనియర్ న్యాయవాది లూథ్రా ఇప్పుడు అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసిందని తెలిపారు. తప్పు దర్యాప్తుకు కారణమైన పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించింది.
”ఏం చర్యలు తీసుకున్నారు? మీరు ఏదైనా షోకాజ్ నోటీసులు జారీ చేశారా? మీరు నాలుగేళ్లగా దర్యాప్తు పూర్తి చేయలేదు. పోలీసు సూపరింటెండెంట్ లేదా ఐఓ (విచారణ అధికారి)ని నియంత్రించలేకపోతే డిజిపికి ఏ అధికారం ఉంది?. ఎస్పీ, డిజిపి ఏం చేస్తున్నారు?” అని సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ”తొలిత తప్పుడు దర్యాప్తు కారణమైన అధి కారులపై ఏదైనా క్రమశిక్షణా చర్య తీసుకోవాలి” అని జస్టిస్ బాగ్చి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా దర్యాప్తు జరుగుతున్న తీరుపై రాష్ట్ర పోలీసులను ధర్మాసనం తీవ్రంగా విమర్శించింది. కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాకపోవడం పట్ల ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులతో దర్యాప్తు అధికారులు పూర్తిగా సహకరించారని వ్యాఖ్యానించింది.

More Stories
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏకసభ్య కమిటీ
ట్రంప్ విచ్చల విడిగా విధించిన టారీఫ్‌ల కొట్టివేత
చెప్పులు, బూట్లు ధరించి వెంకన్న ఫొటోతో వైఎస్సార్సీపీ ఆందోళన