అమెరికా-భారత్ మధ్య ‘సముద్ర కేబుల్ మార్గం’

అమెరికా-భారత్ మధ్య ‘సముద్ర కేబుల్ మార్గం’

* సుందర్  పిచాయ్‌ తో ప్రధాని మోదీ భేటీ

అమెరికా, భారత్, దక్షిణ గోళార్ధంలోని పలు ప్రాంతాల మధ్య ఏఐ కనెక్టివిటీని మెరుగుపర్చడానికి కొత్త సముద్ర మార్గ కేబుల్ మార్గం (సబ్‌సీ కేబుల్ రూట్‌)లను ఏర్పాటు చేస్తామని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు. డిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ఏఐ ద్వారా ఆరోగ్య సంరక్షణ డయాగ్నస్టిక్స్‌ను మెరుగుపర్చడం నుంచి రైతులకు రియల్-టైమ్ అలర్ట్‌లు అందించడం వరకు అనేక సమస్యలను పరిష్కరించవచ్చని వివరించారు.

“ఇవాళ కొత్తగా భారత్‌-అమెరికా అనుసంధాన ప్రక్రియను ప్రకటిస్తున్నాం. దీని ద్వారా సరికొత్త సముద్ర కేబుల్స్‌ వస్తాయి. అమెరికా-భారత్‌ మధ్య ఏఐ అనుసంధానం మరింత పెరుగుతుంది. దక్షిణార్థ గోళంలోని అనేక ప్రాంతాల్లో ఈ కేబుల్స్‌ వస్తాయి. ఈ మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకునేలా యువతలో నైపుణ్యాలు పెంచేందుకు పెట్టుబడులు పెడతాం” అని తెలిపారు. 

ఇది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నైపుణ్యాభివృద్ది కార్యక్రమమని పేర్కొంటూ యువత, ఉద్యోగులు తమ పనుల్లో ఏఐని పెద్దఎత్తున ఉపయోగించుకునేలా సర్టిఫికేషన్‌ కోర్సులను అందిస్తామని చెప్పారు. భారత్‌లో ఈ సేవల కోసం అదానీ ఏఐతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నామని, ఈ సేవలను మొదట ఆంగ్లం, హిందీలో అందుబాటులోకి తెస్తామని, తర్వాత మిగతా భాషల్లోనూ ప్రవేశపెడతామని వివరించారు. 

ఇది గిగావాట్-స్థాయి కంప్యూట్, అంతర్జాతీయ సబ్‌సీ కేబుల్ గేట్‌వేను కలిగి ఉంటుందని, దీనివల్ల ఉద్యోగాలు, అధునాతన ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దేశానికి వస్తాయని సుందర్ పిచాయ్ చెప్పారు. భారతదేశ వైవిధ్యం, భాషా వ్యవస్థ, బలమైన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నూతన ఆవిష్కరణలకు శక్తిమంతమైన పునాది అని పేర్కొన్నారు. “పర్సనల్‌ ఏఐ అసిస్టెంట్ జెమినై యాప్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో భారత్‌ మా అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. భారత్‌లో మాట్లాడే పది భాషల్లో ఇది అందుబాటులో ఉంది” అని చెప్పారు. 

“ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గత ఏడాది 15బిలియన్‌ డాలర్లతో విశాఖలో ఏఐ హబ్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించాం. ఇది గిగావాట్‌ స్థాయిలో ఏర్పాటవుతుంది. సరికొత్త ప్రపంచస్థాయి సముద్ర కేబుల్‌ గేట్‌గా మారుతుంది. కటింగ్‌ ఎడ్జ్‌ ఏఐ ద్వారా ఉద్యోగాలు వస్తాయి. భారత్‌లోని అన్ని ప్రాంతాల ప్రజలు, వ్యాపారవేత్తలకు సేవలు అందుతాయి” అని తెలిపారు.

విద్యార్థులు, ఎర్లీ-కెరీర్ ప్రొఫెషనల్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఇంగ్లీష్, హిందీలలో గూగుల్ ఏఐ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రాం సహా ఆశాజనకమైన స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లను ఆయన వివరించారు. “ఇతర ఇనిషియేటివ్‌లలో కర్మ యోగి భారత్‌తో భాగస్వామ్యం ద్వారా 20 మిలియన్లకు పైగా పబ్లిక్ సర్వెంట్స్‌కు మద్దతు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌తో 10,000 పాఠశాలల్లో జెన్ ఏఐ టూల్స్ పరిచయం, గ్లోబల్ రీసెర్చ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి యుఎస్‌డి 30 మిలియన్ ఏఐ ఫర్ సైన్స్ ఇంపాక్ట్ ఛాలెంజ్ ఉన్నాయి” అని తెలిపారు.
 
ఇలా ఉండగా, గూగుల్ సీఈఓ గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓ సుందర్ పిచాయ్తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భారత్ చేస్తున్న కృషి గురించి, అలాగే భారతీయ విద్యార్థులు, నిపుణులతో కలిసి గూగుల్ ఈ ఏఐ రంగంలో ఎలా ముందుకు సాగవచ్చనే అంశంపై ఆయనతో చర్చించారు. ఈ భేటీ తరువాత ప్రధాని మోదీ ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు.“డల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ను కలవడం సంతోషంగా ఉంది. ఏఐ రంగంలో భారత్ చేస్తున్న కృషి గురించి, అలాగే మన ప్రతిభావంతులైన విద్యార్థులు, నిపుణులు గూగుల్తో కలిసి పనిచేసే అవకాశాల గురించి చర్చించాం”అని ప్రధాని తెలిపారు.