* హైదరాబాద్‌లో మరో కుట్రకు ‘లష్కరే తోయిబా’ యత్నం
మూడేళ్ల క్రితం దసరా పండుగ రోజు వరుస పేలుళ్లకు ప్రయత్నాలు చేసి, హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నిన లష్కరే తోయిబా ఉగ్రవాది జాహెద్, మరో కుట్రకు ప్రయత్నిస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఆ విషయాన్ని నిర్ధారించుకునేందుకు నిఘా వర్గాల బృందం ఈ నెల 17న హైదరాబాద్ నగరానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న జాహెద్, పాకిస్థాన్‌లోని సహచరులతో ఫోన్లో మాట్లాడుతున్నట్లు ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది. 2022 అక్టోబరు 2న మూసారాంబాగ్‌కు చెందిన అబ్దుల్ జాహెద్ అలియాస్ మోటు, అక్చర్‌బాగ్‌కు చెందిన మహ్మద్ సమీయుద్దీన్ అలియాస్ అబ్దుల్ సమి, మాజ్ హసన్ ఫరూక్ అలియాస్ మాజ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
జాహెద్ నుంచి 2 హ్యాండ్ గ్రనేడ్స్, రూ. 3,91,800 నగదు, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సమీయుద్దీన్ నుంచి హ్యాండ్ గ్రనేడ్, రూ.లక్షన్నర నగదు, మొబైల్ ఫోన్, ఒక బైక్, మాజ్‌హసన్ నుంచి గ్రనేడ్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పండుగ సమయాల్లో పాత నేరస్థులు, సోషల్ మీడియాలో నిఘా ఉంచిన పోలీసులు మాజిద్ బృందం కుట్రను పసిగట్టారు.
అక్టోబరు 2 తెల్లవారుజామున మూసారాంబాగ్, చంపాపేట్, మలక్‌పేట్ తదితర ప్రాంతాల్లోని పలు నివాసాల్లో పోలీసులు మెరుపు సోదాలు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఉగ్రవాది ఫర్హతుల్లా గోరీ, అబు అంజాలా, జాహెద్ సోదరుడైన మజీద్ ఆదేశాలతో హైదరాబాద్ నగరంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు తీవ్రంగా అనుమానిస్తున్నాయి.
ఇందుకు అవసరమైన నియామకాలు కూడా చేపట్టారని, అవసరమైన ఆర్థిక సాయం పాకిస్థాన్ నుంచి అందినట్లు అప్పట్లోనే జాహెద్ పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా అంగీకరించాడు. హవాలా మార్గంలో రూ.33 లక్షలు అందగా, ఫరతుల్లా ఘోరీ 4 గ్రనేడ్లు పంపినట్లు చెప్పాడు.
ఆ గ్రనేడ్లు తొలుత కశ్మీర్, ఆ తర్వాత అక్కడి నుంచి మహారాష్ట్రలోని మనోహరాబాద్‌కు రాగా, 2022 సెప్టెంబర్ 28న సమీయుద్దీన్ అనే యువకుడు తన వాహనంపై వెళ్లి హైదరాబాద్ తెచ్చి జాహెద్‌కు అప్పగించాడు. వాటిలో ఒకటి సమీయుద్దీన్, మరొకటి మాజ్‌కు ఇచ్చి జాహెద్ 2 గ్రనేడ్లను తన దగ్గర పెట్టుకున్నాడు. చివరి నిమిషంలో పోలీసులకు పట్టుబడగా, వారి కుట్రకు బ్రేక్ పడింది.
చంచల్‌గూడ జైలులో ఉన్న జాహెద్ ఈ మధ్య తరచుగా పాకిస్థాన్‌లోని తన సోదరుడైన మాజీద్‌తో మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. తదుపరి దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యుల బృందం హైదరాబాద్ వచ్చి చంచల్‌గూడ జైలుకు వెళ్లి విచారణ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆరా తీయగా, జైలు నుంచి మాజిద్ ఫోన్ మాట్లాడుతున్న విషయంలో ఎలాంటి అనుమానం లేదని నిఘా విభాగానికి చెందిన ఒక అధికారి స్పష్టం చేశారు.

More Stories
కుత్రిమ మేధలో దేశ భవిష్యత్ చూస్తున్నాం
ఏఐ సదస్సులో చైనా రోబో డాగ్‌పై వివాదం
ఇరాన్‌పై ఏ క్షణమైనా దాడికి అమెరికా సన్నాహాలు