పిల్లలు సోషల్ మీడియా వాడకంపై మరిన్ని ఆంక్షలు

పిల్లలు సోషల్ మీడియా వాడకంపై మరిన్ని ఆంక్షలు
పిల్లలు, యువత సోషల్ మీడియా (ఎస్‌ఎం) వాడకంపై త్వరలో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వారికి సోషల్ మీడియా వాడకం మరింత సురక్షితంగా ఉండేలా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. యువత సోషల్ మీడియా వాడకం విషయంలో మరింత నియంత్రణ విధించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

‘‘వయసు ఆధారంగా యూజర్లపై ఆంక్షలు విధించే అంశంపై సోషల్ మీడియా సంస్థలతో ప్రభుత్వం నిరంతరం చర్చిస్తోంది. ఈ విషయంలో ఏది సరైంతో ఆలోచిస్తున్నాం. డీప్‌ ఫేక్ వంటి కొత్త టెక్నాలజీలు యువత సహా వినియోగదారులకు ప్రమాదకరంగా మారాయి. వినియోగదారుల్ని, సమాజాన్ని సోషల్ మీడియా దుష్ప్రభావం నుంచి రక్షించేలా చూడాలి” అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

“సోషల్ మీడియా సంస్థలు భారతీయ చట్టాలు, రాజ్యాంగ విలువల్ని పాటించాలి. వాటి విషయంలో దేశంలో ఉన్న ప్రస్తుత చట్టాలు సరిపోవు. చట్టాల్ని మరింత కఠినతరం చేయాలి. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ అయిన నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, మెటా, ఎక్స్ వంటి సంస్థలు దేశ చట్టాల్ని అనుసరించాలి” అని చెప్పారు.  “ఇప్పటికే డీపీడీపీ యాక్ట్ వంటి చట్టాలు రూపొందించాం. పిల్లలు, యువతకు ఎస్ఎం వాడకం నియంత్రించే విషయంలో పార్లమెంట్ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. సమాజానికి రక్షణ కల్పించే రూల్స్ తేవాలి’’ అని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

సోషల్ మీడియా వినియోగం యువతను పక్కదోవపట్టిస్తోందనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. అందులోనూ 18 ఏళ్లలోపు పిల్లలు, యువత వీటిని వాడే విషయంలో నియంత్రణ ఉండాలని తల్లిదండ్రులు, నిపుణులు కోరుతున్నారు. ఈ దిశగానే ప్రభుత్వం చట్టాల్ని మరింత కఠినంగా మార్చబోతున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు.