కృత్రిమ మేధ ‘ఆంథ్రోపిక్’ భయాలతో గత వారం తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురైన భారత ఐటి కంపెనీల షేర్లు మంగళవారం కోలుకున్నాయి. ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ వంటి కంపెనీల షేర్లు రాణిస్తున్నాయి. దీంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2 శాతం మేర పెరిగింది. అధునాతన ఎఐ ఆవిష్కరణల కోసం ఆంథ్రోపిక్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రకటించింది.
ఎఐ భద్రత, పరిశోధన సంస్థ అయిన ఆంథ్రోపిక్‌తో వ్యూహాత్మక సహకారాన్ని ప్రకటించిన తర్వాత ఇన్ఫోసిస్ షేర్లు మంగళవారం బిఎస్ఈ లో 5 శాతం వరకు ర్యాలీ చేసి, రూ.1,431 వద్ద ఒక రోజు గరిష్ట స్థాయికి చేరుకొని లాభపడ్డాయి. టెలికమ్యూనికేషన్స్, ఆర్థిక సేవలు, తయారీ, సాఫ్ట్వేర్ అభివృద్ధిలోని కంపెనీలకు అధునాతన ఎంటర్ప్రైజ్ ఎఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడం, అందించడం ఈ భాగస్వామ్యం లక్ష్యం.
ఆంథ్రోపిక్ క్లాడ్ ఎఐ మోడళ్లతో ఇన్ఫీ తోపజ్ ఎఐ ప్లాట్‌ఫామ్‌ను మిళితం చేసి కస్టమ్ ఎఐ ఏజెంట్లను రూపొందించనున్నారు. ఇటీవలే బెంగళూరులో ఆంథ్రోపిక్ తన తొలి కార్యాలయాన్ని ప్రారంభించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఈ తాజా ప్రకటన వెలువడటం టెక్ షేర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. ఈ ప్రకటనతో మంగళవారం నాటి ట్రేడింగ్ సెషన్లో ఇన్ఫోసిస్ షేర్లు రాణిస్తున్నాయి.
విప్రో, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ లిమిటెడ్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎంఫసిస్, ఎల్‌టీఎం లిమిటెడ్, టెక్ మహీంద్రా వంటి కంపెనీల షేర్లు కూడా ఒక శాతానికి పైగా పెరిగాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఐటీ సంస్థల షేర్లలోనూ కొనుగోళ్లు బలం పుంజుకున్నాయి.

More Stories
100 బిలియన్ డాలర్లతో అదానీ డేటా సెంటర్ల ఏర్పాటు
13.16 శాతం పెరిగిన ఎగుమతులు, వాణిజ్య లోటు రెట్టింపు
భారత్ – యూకే వాణిజ్య ఒప్పందం ఏప్రిల్ నుంచే అమల్లోకి!