‘‘భారతదేశ తదుపరి దశ ఆర్థిక పరివర్తనలో ప్రైవేటు రంగం అత్యంత కీలకమైన పాత్రను పోషించాల్సి ఉంటుంది. ఆ రంగం నుంచి నిర్ణయాత్మక స్పందన వస్తుందని నేను ఆశిస్తున్నాను. వికసిత భారత్ దిశగా మన దేశం పయనించాలంటే ప్రైవేటు రంగం ఆవిష్కరణలు, దీర్ఘకాలిక సామర్థ్యం పెంపు, అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీ వంటి విభాగాల్లో ధైర్యంగా పెట్టుబడులను పెట్టాలి” అని ప్రధాని స్పష్టం చేశారు.
ప్రైవేటు రంగం లాభాలను కాపాడుకోవడంపై తక్కువగా, పరిశోధన – అభివృద్ధి (ఆర్అండ్డీ), సప్లై చైన్, నాణ్యతలపై ఎక్కువగా దృష్టి సారించాలని తెలిపారు. పారిశ్రామిక ఉత్పాదకత పెరిగితే, ప్రైవేటు కంపెనీల యజమానులు ఆ ఫలాలను పారదర్శకంగా కార్మికులతో పంచుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
‘‘వికసిత భారత్ సాధనలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారు అనేది నా బలమైన నమ్మకం. అందుకే మహిళా సంక్షేమం విషయంలో మా ప్రభుత్వం ఎలాంటి రాజీకి తావు ఇవ్వడం లేదు. మా సర్కారు ప్రతీ నిర్ణయంలోనూ మహిళా సంక్షేమ భావన ఉండేలా చూస్తున్నాం. భారత సైనికుల సంక్షేమం అంశానికీ మేం పెద్దపీట వేస్తున్నాం. భారత్ బలంగా, సర్వసన్నద్ధంగా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం” అని ప్రధాని తెలిపారు.
ఇప్పటివరకు ప్రవేశపెట్టిన అన్ని కేంద్ర బడ్జెట్లు దేనికవి ప్రత్యేకమైనవని పేర్కొంటూ బడ్జెట్ రూపకల్పన కోసం తాను అనుసరించే ప్రమాణాలు అలాంటివని చెప్పారు. కరోనా సంక్షోభ కాలం తర్వాత భారతదేశానికి ఎన్నో రంగాల్లో అవకాశాల తలుపులు తెరుచుకున్నాయని, ప్రోత్సాహకాలు, సుంకాల ప్రాధాన్యతలు అనేవి మన దేశ అభివృద్ధి పయనానికి ఊతాన్ని ఇవ్వగలవని స్పష్టం చేశారు.
కానీ నిలకడగా అంతర్జాతీయ మార్కెట్లో పోటీని ఇచ్చే సత్తా రావాలంటే వినూత్న ఆవిష్కరణలు, విశిష్ట సామర్థ్యం, భారీ ఉత్పాదక శక్తిని మనం అందిపుచ్చుకోవాలని ప్రధాని మోదీ చెప్పారు.
“యూపీఐ వేదిక ద్వారా ప్రజల లావాదేవీలను మేం వేగవంతం చేశాం. అందుకే భారత్ ఇప్పుడు ప్రపంచంలో డిజిటల్ లీడర్‌గా మారింది. ఏఐ టెక్నాలజీకి, ఆవిష్కరణలకు దోహదం చేసే ఎకో సిస్టమ్‌కు సైతం భారత్ పునాదులు వేస్తోంది. కంప్యూటింగ్ పవర్‌ను, డేటా సెంటర్ల మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని మనం పెంచుకుంటున్నాం” అని ప్రధాని తెలిపారు.
భారత చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మౌలిక సదుపాయాల కల్పన రంగంపై ప్రత్యేక దృష్టి సారించామని చెబుతూ భవిష్యత్ కోసం బంగారు భారత్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. ఈక్రమంలో ఈసారి కేంద్ర బడ్జెట్లో మూలధన వ్యయం కోసం రూ.12.2 లక్షల కోట్లను కేటాయించామని, 2013 కేంద్ర బడ్జెట్‌తో పోలిస్తే ఇది ఐదురెట్లు ఎక్కువని ప్రధాని మోదీ వివరించారు.

More Stories
‘వైట్ కాలర్’ టెర్రర్ మాడ్యూల్ ‘అన్సార్ ఇంటీరియం’
టీ20 ప్రపంచకప్‌లో పాక్ ను చిత్తుగా ఓడించిన భారత్
రైతుల ప్రయోజనాలపై రాహుల్, అమిత్ షా మాటల యుద్ధం