శిధిలాలపై నిజమైన విజయాన్ని ఎవ్వరూ నిర్మించలేరు

శిధిలాలపై నిజమైన విజయాన్ని ఎవ్వరూ నిర్మించలేరు
కూలిపోయిన ఉగ్రవాద స్థావరాలు, ధ్వంసమైన రన్‌వేలు, పనికిరాని వైమానిక రక్షణ వ్యవస్థల మీద నిజమైన విజయాన్ని ఎప్పటికీ నిర్మించలేరని పాకిస్థాన్‌ను ఉద్దేశించి సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఎద్దేవా చేశారు. పుణెలో జరిగిన ‘జై సే విజయ్’ సెమినార్ ప్రారంభోత్సవంలో సీడీఎస్ పాల్గొంటూ కొన్ని దేశాలు ప్రగల్భాల ద్వారా విజయం సాధించామని భ్రమపడుతుంటాయని చురకలు అంటించారు.
 
“విజయం అనేది కేవలం వాక్చాతుర్యం వల్ల వరించదు. మన పొరుగున ఉన్న కొన్ని దేశాలు కేవలం మాటలతో విజయాన్ని ప్రకటించుకున్నాయి. కానీ విజయం అనేది ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో మనం ప్రదర్శించినట్లుగా సాక్ష్యాధారాలతో నిరూపితమవ్వాలి. ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాలు, దెబ్బతిన్న రన్‌వేలు, నిర్వీర్యమైన విమానశ్రయాలు, పనికిరాని వైమానిక రక్షణ వ్యవస్థల మీద విజయాన్ని నిర్మించలేరు. ఇటువంటి విజయాలు ఎంతో కాలం నిలవవు” అని స్పష్టం చేశారు.

రాబోయే దశాబ్ద కాలంలో భారత రక్షణ రంగం ఎలాంటి సవాళ్లను ఎదర్కోబోతోందనే దానిపై ప్రస్తావిస్తూ మారుతున్న ప్రపంచంలో శాశ్వత మిత్రులు కానీ, శత్రువులు కానీ ఉండరని చెప్పకొచ్చారు. ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొంటూ అందుకే భారత్ మానసికగా, నిర్మాణపరంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేలా సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

భవిష్యత్ యుద్ధాలు అత్యంత పోటీతత్వంతో, అధునాతన సాంకేతికతో కూడి ఉంటాయని, వాటిని ఎదుర్కోవడానికి కొత్త ఆలోచనలతో ముందుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ దేశాల మధ్య భాగస్వామ్యాలు అవసరమే కానీ, అవి దేశ సొంత సామర్థ్యానికి ప్రత్యామ్నాయం కాకూడదని వ్యాఖ్యానించారు. వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి కోసం దేశీయ రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని చౌహన్ సూచించారు.

“రాబోయే దశాబ్ద కాలం కోసం భారత రక్షణ వ్యవస్థను, భవిష్యత్తులో మన ముందున్న సవాళ్లను నిశితంగా అంచనా వేయాలి. రాబోయే కాలం మరింత పోటీతత్వం, సాంకేతికంగా విచ్ఛిన్నకరంగా మారబోతోందని నేను నమ్ముతున్నాను” అని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. మరోవైపు, ఆత్మనిర్భరత అనేది వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి గురించి అని, ఒంటరితనం గురించి కాదని ఆయన స్పష్టం చేశారు.

ఆత్మనిర్భరత తరచుగా సంస్థ యంత్రాంగానికి పరిమితం చేస్తుంటారని, దాని ఇరుకైన విధానం రక్షణ తయారీ లేదా రక్షణ పరిశోధన, అభివృద్ధికి మాత్రమే పరిమితం చేయడం కాదని తెలిపారు.  భద్రతా సవాళ్లు సాంప్రదాయేతర రంగాలలోకి కూడా విస్తరిస్తున్నాయని జనరల్ అనిల్ చౌహన్ హెచ్చరించారు. ఆరోగ్య మహమ్మారి, కీలకమైన మౌలిక సదుపాయాల అంతరాయాలు, వాతావరణ సంబంధిత ఒత్తిళ్లు వ్యూహాత్మక స్థాయి ప్రభావాలను సృష్టించే సామర్థ్యాన్ని ప్రదర్శించాయని తెలిపారు.