ఏపీ బడ్జెట్ రాష్త్ర అభివృద్ధికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌

ఏపీ బడ్జెట్ రాష్త్ర అభివృద్ధికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్  ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్  తెలిపారు. ఈ బడ్జెట్ ప్రధానంగా సంపద సృష్టి, అభివృద్ధి , సంక్షేమం అనే మూడు సూత్రాల ఆధారంగా రూపొందించినట్లు చెప్పారు.
 
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి లు, మీడియా ప్యానెలిస్టులతో జరిపిన ఆడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ లను సమ్మిళితం చేస్తూ ప్రజల కు తెలియచేయాలని దిశానిర్ధేశం చేశారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 3,32,000 కోట్ల వ్యయంతో, 11.25% వృద్ధి రేటు లక్ష్యంగా ఏపీ బడ్జెట్‌ను ప్రతిపాదించడం ఒక సాహసోపేతమైన చర్య అని ఆయన కొనియాడారు. 
 
రెవెన్యూ లోటును 1.86 కి పరిమితం చేయడం ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం అని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కలవడం వల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో ‘వికసిత ఆంధ్రప్రదేశ్’ ద్వారా ‘వికసిత భారత్’ నిర్మాణానికి ఈ బడ్జెట్ పునాది వేస్తుందని  మాధవ్ ఆడియో కాన్ఫరెన్స్ లో వివరించారు.
 
గూగుల్ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో సుమారు $15 బిలియన్ల (రూ.1,35,000 కోట్లు) పెట్టుబడులకు ఈ బడ్జెట్ ప్రాధాన్యతనిచ్చిందని, అలాగే సెమీ కండక్టర్స్ మిషన్ 2.0, రేర్ ఎర్త్ కారిడార్ వంటి ప్రాజెక్టులను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని అభినందించారు.  రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ. 30,000 కోట్లతో సమగ్ర ప్రణాళికను రూపొందించారని అభినందించారు. 
దీర్ఘకాలిక అభివృద్ధి కోసం, సీడ్ కార్పస్‌గా ఉపయోగపడేలా ఈ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం ఒక వినూత్న ఆలోచన అని మాధవ్ కొనియాడారు.  ఎన్టీఆర్ భరోసా, అన్నపూర్ణ క్యాంటీన్లు, రైతులకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలకు యధాతథంగా నిధులు కేటాయించడమే కాకుండా, మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.
ఈ బడ్జెట్ కేవలం అంకెలకు పరిమితం కాకుండా, ఒక ప్రగతిశీల ఆలోచనతో రాష్ట్ర భవిష్యత్తును మార్చే విధంగా ఉందని ప్రజలకు తెలియ చేయాలని ఆయన చెప్పారు. 
 ఈ బడ్జెట్ విశేషాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సోషల్ మీడియా , ప్రధాన మీడియా వేదికగా డబుల్ ఇంజన్ సర్కార్ విజయాలను ప్రచారం చేయాలని సూచించారు.