తమిళనాడులో ప్రభుత్వంలో వాటాకై కాంగ్రెస్ పట్టు!

తమిళనాడులో ప్రభుత్వంలో వాటాకై కాంగ్రెస్ పట్టు!

తమిళనాడులో పొత్తులు మాత్రమే అని, సంకీర్ణ ప్రభుత్వాలు చెల్లుబాటు కావని ఒక వంక ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేస్తుండగా, తమకు అధికారంలో వాటా కావాల్సిందే అంటూ కాంగ్రెస్ మరోసారి స్పష్టం చేసింది. దానితో ఎన్నికల ముందు డీఎంకే- కాంగ్రెస్ బంధం ప్రశ్నార్ధకంగా మారింది.   పైగా, 2021లో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోయిన సీట్లను మాత్రమే తాము కోరుతున్నామని స్పష్టం చేసింది.

ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనాయకుడు మాణికం ఠాగూర్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఈ ఏడాది జరగబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే 170 స్థానాల్లో పోటీ చేస్తుందని రాష్ట్ర మంత్రి రాజా కన్నప్పన్ ఫిబ్రవరి 13న ప్రకటించారు. అందులో 160 సీట్లలో డీఎంకే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

“2021లో మీరు (డీఎంకే) 173 సీట్లలో పోటీ చేసి 133 స్థానాల్లో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో డీఎంకే గెలవని సీట్లను మేము (కాంగ్రెస్) కోరుతున్నాం. అధికార భాగస్వామ్యం కూడా కావాలి. అధికారంలో వాటా మా పార్టీ హక్కు. ప్రజలే ఆ విషయాన్ని నిర్ణయిస్తారు” అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.  తమిళనాడులో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని డీఎంకేను కోరుతోంది.

అలాగే ఎన్నికల తర్వాత అధికారంలో కూడా తమకు వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది.  ఇదే విషయంపై డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవల ఓ కార్యక్రమంలో స్పందిస్తూ అధికారంలో వాటా అనే వాదన తమిళనాడుకు సరిపోదని, ఆ విషయం డీఎంకే, కాంగ్రెస్‌కు తెలుసని తెలిపారు. పైగా, మధ్యలో ఉన్న కొందరు కూటమిని చీల్చేందుకు చేస్తున్న కుట్రే ఈ ప్రచారమని పేర్కొంటూ దీన్ని కూటమిని బలహీనపరచే ప్రయత్నంగా కొట్టిపారేశారు.

తమిళనాడు ఎప్పటి నుంచో స్వయం ప్రతిపత్తి, కేంద్రంలో సమాఖ్య వ్యవస్థ అనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. ఇక్కడ అధికార భాగస్వామ్యం అనే భావనకు స్థానం లేదని, కూటమిలోని మిత్రపక్షాలన్నీ దీన్ని అంగీకరించాయని చెప్పారు. 2021లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. 173 సీట్లలో పోటీ చేసిన డీఎంకే 133 సీట్లలో విజయఢంకా మోగించింది. అలాగే 25 సీట్లలో పోటీ చేసిన హస్తం పార్టీ 18 సీట్లలో గెలుపొందింది.