మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అంచనాలు తారుమారు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అంచనాలు తారుమారు
* బిఆర్ఎస్, బిజెపిలకు సహితం నిరాశ ఫలితాలే!
మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అంచనాలు తాకకువయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ సగం కూడా గెలవలేదు. ఆ గెలిచిన మున్సిపాలిటీల్లోనూ ఆ పార్టీకి ఒకటీ అరా వార్డులే ఆధిక్యంగా ఉన్నాయి. పార్లమెంట్‌ ఎన్నికలతో పోలిస్తే గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ భారీగా పడిపోయిందని తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాలికి బలపం కట్టుకొని తిరిగినా అంతంతే ఫలితాలు వచ్చాయి.
 
మున్సిపల్‌ ఎన్నికల్లో 90 మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లను కాంగ్రెస్‌ పార్టీ సొంతం చేసుకోబోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. అయితే 60 శాతం లోపే ఫలితాలు కాంగ్రెస్ సాధించింది. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా మున్సిపల్‌ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ 70-80 శాతం స్థానాలను సొంతం చేసుకుంటుంది. ఇది ఆనవాయితీ. కానీ, రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి.
 
మున్సిపాలిటీలకు సంబంధించి 116 పురపాలికల్లో 52 శాతానికి పైగా వార్డుల్ని ఛేజిక్కుంచుకుని కాంగ్రెస్‌ 66 చోట్ల జయభేరి మోగించింది. బీఆర్​ఎస్​ 13 చోట్ల గెలిచింది. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్‌ బ్లాక్‌ కైవసం చేసుకుంది. 36 పురపాలికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాలేదు.  పురపాలికల్లో మొత్తం 2,581 వార్డులకు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్ 1,347 చోట్ల గెలుపొందింది. బీఆర్​ఎస్​ 716 చోట్ల విజయం సాధించింది. 
బీజేపీ 261 చోట్ల గెలవగా, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 257 చోట్ల విజయం సొంతం చేసుకున్నారు.  బీజేపీకి కరీంనగర్‌ కార్పొరేషన్‌ మాత్రమే దక్కే సూచనలున్నాయి. దాదాపు మూడో వంతు మునిసిపాలిటీలలో హ్యాంగ్ ఏర్పడటంతో అనిశ్చిత వాతావరణం నెలకొంది. మున్సిపల్ కార్పొరేషన్ లలో కాంగ్రెస్ 191 డివిజన్ లను మాత్రమే గెల్చుకోగా, బిజెపి 77 డివిజన్లు తేల్చుకొని రెండో స్థానంలో ఉంది. ఇక బిఆర్ఎస్ అయితే 63 డివిజన్ లకు పరిమితమయింది.
మెరుగైన స్థానాలను సాధిస్తామన్న బీఆర్​ఎస్ ​పార్టీ, మున్సిపల్ ఎన్నికల్లో మూడో వంతు కూడా సాధించలేకపోయింది. పురపాలికల్లో 28 శాతం వార్డులను గెలుచుకున్న గులాబీ పార్టీ, కార్పొరేషన్లలోని డివిజన్లలో మాత్రం అంత ప్రభావం చూపలేకపోయింది. 13 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బిఆర్ఎస్, మరో 12 చోట్ల ఆధిక్యంలో నిలిచింది. నాలుగు చోట్ల కనీసం ఖాతా సైతం తెరవలేదు. 
 
ఉమ్మడి మెదక్‌లో మరోమారు తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఏడు కార్పొరేషన్లలో 15 శాతం డివిజన్లకు మాత్రమే పరిమితమైంది. కరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లలో కనీసం రెండో స్థానంలోనూ లేదు.  116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగిన 2,581 వార్డులకు గానూ బీఆర్​ఎస్ ​పార్టీ 716 వార్డుల్లో మాత్రమే జయకేతనం ఎగురవేసింది
 
మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో బిజెపి సహితం అనుకున్న స్థాయిలో గెలవలేకపోయింది. మున్సిపాలిటీల్లో బీజేపీ ఖాతాలో పడిన వార్డులు సుమారు 10 శాతం మాత్రమే. బీజేపీ పార్టీ ఉత్తర తెలంగాణ మినహా మిగతా ప్రాంతాల్లో నామమాత్ర ప్రభావమే చూపింది. నారాయణపేట మున్సిపాలిటీలో 24 వార్డులకు గానూ బీజేపీ 11 గెలుచుకుంది. 
 
నారాయణపేట ఛైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 13 కావాలి కరీంనగర్‌, నిజామాబాద్‌ కార్పొరేషన్లలో మెరుగైన స్థానాలు సాధించగా, మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెంలో బీజేపీ కొన్ని డివిజన్లను కైవసం చేసుకుంది. గతంలో బీజేపీ సిట్టింగ్‌ స్థానాలైన మక్తల్‌, ఆమనగల్‌ను కోల్పోవడం పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
 
నిజామాబాద్​లోని 60 డివిజన్లలో బీజేపీ 28 గెలుచుకుంది. కాంగ్రెస్​ 17, బీఆర్​ఎస్​ 1, ఇతరులు 1 సత్తా చాటారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి స్పష్టమైన అధిక్యత రాకపోవడంతో మేయర్​ పీఠంపై పీటముడి నెలకొంది. ఈ పదవి దక్కాలంటే కనీసం 31 స్థానాలు రావాలి. ఈ నెల 16న మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్ల పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. అంతిమంగా ఏ పార్టీకి ఎన్ని పీఠాలు దక్కుతాయనేది ఆ రోజే తేలనుంది.