భారతదేశ ఆర్థిక భవిష్యత్తు దేశీయ సామర్థ్యాల బలోపేతం, ఆవిష్కరణల ఆధారిత వృద్ధి, విధాన స్థిరత్వంపై ఆధారపడి ఉంటుందని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్, ఆర్థిక నిపుణులు, స్వదేశీ జాగరణ మంచ్ జాతీయ కన్వీనర్ ఆర్.సుందరం పేర్కొన్నారు. పన్నులు, కార్పొరేట్ చట్టం, ఆర్థిక విధానంలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవమున్న ఆయన శుక్రవారం శ్రీసిటీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని పరిశ్రమల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.
అతిథికి సాదర స్వాగతం పలికిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మారుతున్న విధానాలు, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమ వర్గాలను చైతన్యవంతులను చేయడానికి సంబంధిత నిపుణులతో తరచూ ఈ తరహా కార్యక్రమాల నిర్వహణ ప్రాముఖ్యతను వివరించారు.
‘మారుతున్న గ్లోబల్ పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ’ అనే అంశంపై ప్రసంగించిన సుందరం, ప్రధానంగా ప్రపంచ ఆర్థిక పరిణామాలు, భారత ఆర్థిక వ్యవస్థలోని నిర్మాణాత్మక బలాలను ప్రస్తావించారు. స్వావలంబన, స్వయం సమృద్ధి, బలమైన సరఫరా గొలుసులు, దేశీయ విలువ సృష్టి ప్రాధాన్యతను వివరించిన ఆయన, దేశ పురోగాభివృద్ధిలో బలమైన పరిశ్రమ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
స్థానిక పరిశ్రమలకు సాధికారత కల్పించడం, విధానాలు, ఆవిష్కరణలు, వ్యవస్థాపకతను ప్రపంచ అవకాశాలతో సమన్వయం చేయడంపై భారతదేశ దీర్ఘకాలిక ఆర్థిక బలం ఆధారపడి ఉంటుందని చెప్పారు. పోటీతత్వం, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి అధునాతన తయారీ, డిజిటల్ సాంకేతికతలు, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు, వ్యవసాయ సాంకేతికత, బలమైన మౌళిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో శ్రీసిటీ పరిశ్రమలకు చెందిన పలువురు సీఈఓలు, ఉన్నతాధికారులు పాల్గొని, భారత తయారీ, వాణిజ్యం, పెట్టుబడులపై గ్లోబల్ ఆర్థిక మార్పుల ప్రభావం అంశాలపై పరస్పర చర్చలు జరిపారు. నూతన వ్యాపార అవకాశాలు, సవాళ్ల పట్ల అభిప్రాయాలు పంచుకున్నారు.

More Stories
ఇక శ్రీకాళహస్తిలోను గిరి ప్రదక్షిణ!
ప్రశిక్షణ ద్వారా బీజేపీ సంస్థాగత బలోపేతం
ఏపీ మద్యం కుంభకోణం కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి