మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ గూస్కోర్ పండత్’ సినిమా టైటిల్‌ని తక్షణం మార్చాలని సుప్రీంకోర్టు నిర్మాతలను ఆదేశించింది. నీరజ్ పాండే, రితేశ్ షా సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్ ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందని సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ని విచారించిన జస్టిస్ బి.వి. నాగరత్న, ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
వాక్ స్వాతంత్య్రం పేరుతో ఒక నిర్దిష్ట సామాజిక వర్గాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని, సమాజంలో ఇప్పటికే ఉన్న విభేదాలను ఇలాంటి టైటిళ్లతో మరింత పెంచవద్దని ఘాటుగా వ్యాఖ్యానించింది.
“అలాంటి శీర్షిలకతో సమాజంలోని ఒక వర్గాన్ని ఎందుకు కించపరచాలి? ఇది నైతికతకు విరుద్ధం. భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ, అది ఎవరినీ కించపరచడానికి అనుమతించదు. టైటిల్‌ను మార్చి, కొత్త శీర్షికను మాకు చెప్పకపోతే సినిమాను విడుదల చేయడానికి మేం అనుమతించము. చిత్ర నిర్మాతలు, జర్నలిస్టులను బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మేం భావిస్తాము” అని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది.
ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్‌సి), డైరెక్టర్ నీరజ్‌కు సినిమా విడుదలను ఆపాలని దాఖలైన పిటిషన్‌పై నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ టైటిల్ సమాజంలోని ఏ వర్గాన్ని కూడా కించపర్చేలా లేదని తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని దర్శకుడు పాండేను సుప్రీంకోర్టు ఆదేశించింది.
‘పండత్’ అనే పదానికి ‘ఘూస్ఖోర్’ (అవినీతిపరుడు) అనే పదాన్ని చేర్చడం వల్ల బ్రాహ్మణ సామాజిక వర్గ మనోభావాలు దెబ్బతింటున్నాయని దాఖలైన పిటిషన్లను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, కొత్త పేరును ఖరారు చేసి అఫిడవిట్ దాఖలు చేసే వరకు సినిమా విడుదలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ స్టే విధించింది.
దీనిపై స్పందించిన నెట్‌ఫ్లిక్స్, దర్శకుడు నీరజ్ పాండే బృందం, కోర్టు ఆదేశాల మేరకు టైటిల్‌ను మారుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లను తొలగించగా, తదుపరి విచారణ ఫిబ్రవరి 19న జరగనుంది. కాగా, ఈ సినిమా డైరెక్టర్ పై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశంపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

More Stories
రాహుల్ సభ్యత్వం రద్దు చేయాలని బిజెపి ఎంపీ తీర్మానం
114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం
ఐపీఎల్ 2026కు ఎన్నికల సెగ