* నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేటీన్ల కైవసం! 6 మునిసిపాల్టీలో అతిపెద్ద పార్టీ
రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు అధికారికంగా బిజెపి 250కు పైగా వార్డుల్లో బిజెపి విజయం సాధించిందని, దాదాపు 6 మున్సిపాలిటీల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ప్రకటించారు. మొట్టమొదటిసారిగా నిజామాబాద్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లను కైవసం చేసుకునే దిశగా బీజేపీ ముందుకెళ్తోందని చెప్పారు.
మున్సిపల్ కార్పొరేషన్లలో దాదాపు 70 డివిజన్ల వరకు గెలిచే పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు. మంచిర్యాల, రామగుండం, నల్లగొండ తదితర ప్రాంతాల్లో గతంలో కంటే బిజెపి మెరుగుపడిందని పేర్కొన్నారు. మొత్తం కలిపి కార్పొరేషన్లు, వార్డు మెంబర్లు కలిపి 320 నుంచి 350 స్థానాల్లో బిజెపి విజయం సాధించే దిశగా ఉందని వివరించారు. 5 మున్సిపాలిటీలను బిజెపి కైవసం చేసుకుంటున్నామని, వేములవాడ, రాయికల్, నారాయణపేట్, ఆదిలాబాద్, మెట్‌పల్లిలలో చైర్మన్ పదవులను కూడా బిజెపి గెలుచుకుంటోందని ఆయన భరోసా వ్యక్తం చేశారు.
గతంలో కేవలం 2 మున్సిపాలిటీల్లో మాత్రమే విజయం సాధించగా, దాదాపు 241 వార్డు మెంబర్లు గెలవడం ద్వారా ఈసారి ఆ సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎలా తీసుకువస్తాం, మున్సిపాలిటీలను ఎలా అభివృద్ధి చేస్తామనేది వివరించామని తెలిపారు.
పైగా, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ప్రజలకు చేసిన మోసాలు, అన్యాయంపై చార్జ్ షీట్ విడుదల చేశామని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో దాదాపు 350 సీట్లు గెలిచే దిశగా ఫలితాలు కనపడుతున్నాయని ఆయన చెప్పారు. సుమారు 200 వార్డుల్లో 2 నుంచి 25 ఓట్ల తేడాతో బిజెపి అభ్యర్థులు స్వల్పంగా ఓడిపోయారని, త్రిముఖ పోటీ కారణంగా కొన్ని ప్రాంతాల్లో బిజెపి కి కొంత నష్టం జరిగిందని రామచందర్ రావు తెలిపారు.
గతంలో ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో కూడా బిజెపి ఖాతా తెరిచిందని పేర్కొంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఒక వార్డు, కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఒక డివిజన్‌లో విజయం సాధించిందని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధారణంగా ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని, అయినప్పటికీ కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ రాలేదని, చాలాచోట్ల హంగ్ పరిస్థితి ఉందని తెలిపారు.
దీంతో కాంగ్రెస్ చెప్పుకునేంత గొప్ప విజయమేమీ కాదని, సాధించిన విజయాలు కూడా అధికార దుర్వినియోగం, పోలీసుల దౌర్జన్యాలతోనే అని ఆయన విమర్శించారు.
భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్న పార్టీ, బీఆర్ఎస్ దిగజారుతున్న పార్టీ అని చెబుతూ బిజెపి ఓటు షేర్ 13% నుంచి 20 శాతానికి పెరిగినట్లు కనిపిస్తోందని చెప్పారు. ఆదిలాబాద్, ఖానాపూర్, బైంసా ప్రాంతాల్లో చైర్మన్ స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
మజ్లిస్ మద్దతుతోనే చాలాచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిచాయని, అర్బన్ నక్సలైట్లు, కమ్యూనిస్టులు, ఎంఐఎం కలిసి భారతీయ జనతా పార్టీని ఓడించే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. భారతీయ జనతా పార్టీ గెలుపును అడ్డుకునే లక్ష్యంగా రెండో స్థానంలో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ ఏది ఉంటే ఆ పార్టీకి ఓటు వేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ముస్లిం ఓటర్లకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్–బీఆర్ఎస్–ఎంఐఎం మధ్య “పెవికాల్ బంధం” ఉందని ఆరోపించారు. మజ్లిస్ మద్దతు లేకుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలవలేవని పేర్కొంటూ తాము చాలాచోట్ల స్వల్ప తేడాతో ఓడామని, అందుకు కారణం మజ్లిస్ పార్టీయే అని ధ్వజమెత్తారు.
రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసి మజ్లిస్‌కు ఒక మేయర్ సీటు కట్టబెట్టే ప్రయత్నం చేసిందని రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో హంగ్ వచ్చిన చోట బిజెపి ఎవరికీ మద్దాతు ఇవ్వదని, ఎక్కడా ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వమని స్పష్టం చేశారు.
More Stories
తారిక్ రెహమాన్‌ను టెలిఫోన్ లో అభినందించిన ప్రధాని మోదీ
అఖండ విజయం దిశగా దూసుకుపోతున్న బిఎన్‌పి
రాహుల్ సభ్యత్వం రద్దు చేయాలని బిజెపి ఎంపీ తీర్మానం