బాబ్రీ మసీదు​ పునర్​నిర్మాణం ఎప్పటికీ జరగదు

బాబ్రీ మసీదు​ పునర్​నిర్మాణం ఎప్పటికీ జరగదు
బాబ్రీ మసీదు​ పునర్​నిర్మాణం ఎప్పటికీ జరగదని ఉత్తర​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ స్పష్టం చేశారు. దాని గురించి కలలు కంటున్న వారు దేశ చట్టాలకు కట్టుబడి ఉండాలని హెచ్చరించారు. బారాబంకిలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ బెంగాల్​లో టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే బాబ్రీ తరహాలోనే మసీద్​ నిర్మిస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆదిత్యనాథ్​ ఈ మేరకు వాఖ్యలు చేశారు.

“ఇప్పటికీ బాబ్రీ నిర్మాణం గురించి కలలు కంటున్న వారికి మేము ఒకటి చెప్పాలనుకుంటున్నాము. ఆ నిర్మాణం జరిగే వినాశన దినం ఎప్పటికీ రాదు. ‘ఖయామత్’ (చివరి రోజు) ఎప్పటికీ రాదు. అందువల్ల బాబ్రీ పునర్​ నిర్మాణం ఎప్పటికీ జరగదు. ‘ఖయామత్’ రోజు గురించి కలలు కనే వారు విసిగిపోతారు. ఆ రోజు ఎప్పటికీ రాదు. భారత్​లోని నియమాల ప్రకారం జీవించడం నేర్చుకోండి. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆ మార్గం స్వర్గానికి కాదు, నరకానికి మాత్రమే దారితీస్తుంది” అని హెచ్చరించారు.

“ఈ 500 సంవత్సరాల్లో చాలా మంది రాజులు, చక్రవర్తులు వచ్చారు. చాలా ప్రభుత్వాలు వచ్చిపోయాయి. భారత్​ 1947లో స్వాతంత్ర్యం పొందింది. 1952లో జరిగిన మొదటి ఎన్నికల తర్వాత, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ రాముడి జన్మస్థలంలో రాముడి కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలనే ఆలోచన వారికి ఎందుకు రాలేదు?” అని ప్రశ్నించారు. 

“కొంతమంది అవకాశవాద వైఖరిని అవలంబిస్తారు. సంక్షోభం వచ్చినప్పుడు వారు రాముడిని గుర్తుంచుకుంటారు. కానీ తరువాత ఆయనను మరచిపోతారు. కాబట్టి, రాముడు ఇప్పుడు వారిని కూడా మరచిపోయాడు. రామద్రోహులకు ఎక్కడా స్థానం లేదు. రామ భక్తులపై కాల్పులు జరిపి, నిర్మాణాన్ని అడ్డుకున్నారు” అని యోగి ఆదిత్యనాథ్​ మండిపడ్డారు. సనాతన ధర్మం నుంచి భారతదేశాన్ని వేరు చేయలేమని సీఎం యోగి ఆదిత్యనాథ్​ తేల్చి చెప్పారు.

“ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం, భారతదేశం, భారతీయతపై దాడి జరుగుతుంది. లోపల, బయటి దాడుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే భారత పురోగతిని ఇష్టపడని వారు, వీకసిత్ భారత్ దృఢ సంకల్పాన్ని జీర్ణించుకోలేని వారు కుట్రలో నిమగ్నమై ఉన్నారు” అని ఆదిత్యనాథ్ ఆరోపించారు. ప్రతి భారతీయుడు ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ దార్శనికత కోసం సానుకూల దృక్పథంతో పనిచేయాలని ఆయన సూచించారు.