విశాఖపట్నంలోని ఈఎస్‌ఐఎస్ ఆసుపత్రిని మెడికల్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. మెడికల్ ఎడ్యుకేషన్‌ను విస్తరించటంతో పాటుగా ఈఎస్‌ఐ లబ్ధిదారులకు మరింత మెరుగ్గా ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈఎస్ఐ సామాజిక భద్రతా పథకం కింద కేంద్రం ప్రభుత్వం దేశవ్యాప్తంగా మెడికల్ ఎడ్యుకేషన్, ఆరోగ్య సేవలను విస్తరించాలని భావిస్తోంది.
ఈ క్రమంలోనే ఎంప్లాయిమెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసి) దేశవ్యాప్తంగా పది ఈఎస్ఐ/ఈఎస్ఐఎస్ ఆస్పత్రులను మెడికల్ కాలేజీలుగా మార్చాలని భావిస్తోంది. ఇందులో విశాఖపట్నం కూడా ఉంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయమంత్రి శోభా కరంద్లాజే ఈ విషయాన్ని వెల్లడించారు.
జాతీయ వైద్య మండలి విధానాలకు అనుగుణంగా ఈ అప్‌గ్రడేషన్ ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్పత్రులను అధికారికంగా ఈఎస్ఐసీకి అప్పగించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. విశాఖపట్నంలోని ఈఎస్ఐఎస్ ఆస్పత్రిని, ఏపీ ప్రభుత్వం ఈఎస్ఐసీకి అప్పగించడం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
ఆరోగ్య రంగ సేవలను విస్తరించేందుకు ఈఎస్ఐసీ సంస్కరణలు అమలు చేస్తోంది. అందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను ఈఎస్ఐసీ నెట్‌వర్క్‌తో అనుసంధానించడంపైనా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక విశాఖపట్నం వంటి పారిశ్రామిక నగరాలకు తాజాగా తీసుకున్న నిర్ణయం ఎంతో ఉపకరిస్తుందని అధికారులు చెప్తున్నారు.
మరోవైపు విశాఖపట్నంలోని ఈఎస్ఐఎస్ ఆస్పత్రిని మెడికల్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర బృందం జనవరిలో విశాఖలో పర్యటించింది. మరోవైపు ఈఎస్ఐఎస్ ఆస్పత్రిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈఎస్ఐసీకి అప్పగించేందుకు కసరత్తు జరుగుతోంది. స్టాఫ్, నిర్వహణ ఖర్చులు వంటి అంశాలపై కేంద్ర, రాష్ట్ర అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం విశాఖలోని ఈఎస్ఐఎస్ ఆస్పత్రి 200 పడకల సామర్థ్యంతో నడుస్తుంది. షీలానగర్‌లో 400 పడకల సామర్థ్యంతో ఈఎస్ఐసీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది. దీని నిర్మాణం పూర్తి అయితే కార్మికులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుతాయి.

More Stories
ప్రకాశం బ్యారేజీ నుండి హంసలదీవి వరకు “దేవతా వృక్షాలు”
ప్రతి లడ్డూ కౌంటర్లో యూపీఐ చెల్లింపులు
కల్తీ లడ్డు వాస్తవాలను వెల్లడించనున్న కూటమి నేతలు