హిందూ ధర్మ పరిరక్షణకోసం రాబోవు ఆరు నెలలో చేపట్టనున్న కార్యక్రమాలలో భాగంగా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్చి 8 నుండి 10 వరకు కంచి పీఠాధిపతులు పూజ్యశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారుల సూచన మేరకు ప్రకాశం బ్యారేజీ నుండి హంసలదీవి వరకు “దేవతా వృక్షాల” నాటడం జరుగుతుందని ట్రస్ట్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డా. దాసరి శ్రీనివాసులు తెలిపారు.
ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ పూర్వ కమిటీ సభ్యులు, ప్రస్తుత కమిటీ సభ్యులతో విజయవాడలో జరిపిన సమావేశంలో రాబోవు కార్యక్రమాల గురించి విస్తృతంగా చర్చించారు. సభ్యులు అందించిన సూచనలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్ కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ డా. శ్రీనివాసులు మాట్లాడుతూ, రాబోయే ఆరు నెలల కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికను వివరించారు.
అలాగే, ఆషాఢ మాసంలోని వ్యాస పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో చిన్నారులకు “అక్షరాభ్యాసం” కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. గ్రామాల కేంద్రంగా ఉన్న దేవాలయాలలో నిరంతర పూజా కార్యక్రమాలు, దీపప్రజ్వలనాలు, ధూపదీప నైవేద్యాలు నిరాటంకంగా కొనసాగేందుకు ఆర్థిక సహకారం అందించే హిందూ ధర్మం అభ్యున్నతి కొరకు ప్రయత్నం చేసే పెద్దల మద్దతుతో చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
అదేవిధంగా, భజన కళాకారుల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని వారి కొరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వర్తించి తగిన గుర్తింపు ఇచ్చి స్థానికంగా ఉన్న దేవాలయాలలో వారి సహకారాన్ని తీసుకుంటామని డా. శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో నిర్మాణమైన దేవాలయాలలో అర్చకులకు గౌరవ వేతనం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
ముఖ్యంగా ప్రతి దేవాలయాన్ని సర్వతోముఖ అభివృద్ధి కేంద్రంగా మార్చేందుకు భోజనాలయం, విద్యాలయం, శరణాలయం, పఠనాలయం ఏర్పాటు చేసే దిశగా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కృషి చేస్తుందని చైర్మన్ తెలిపారు.

More Stories
విశాఖలో ఈఎస్ఐ మెడికల్ కాలేజీ
ప్రతి లడ్డూ కౌంటర్లో యూపీఐ చెల్లింపులు
కల్తీ లడ్డు వాస్తవాలను వెల్లడించనున్న కూటమి నేతలు