భారత్‌ – అమెరికా వాణిజ్య ఒప్పందం ముసాయిదా విడుదల

భారత్‌ – అమెరికా వాణిజ్య ఒప్పందం ముసాయిదా విడుదల

* భారత్ పై 25 శాతం అదనపు సుంకం రద్దు

భారత్- అమెరికాలు పరస్పర, సమతుల్య వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ముసాయిదాను సంయుక్తంగా విడుదల చేశాయి. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చల్లో శనివారం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటన కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నాయి.
 
ఈ ఒప్పందంలో భాగంగా భారత వస్తువులపై అమెరికా తన సుంకాలను 18 శాతానికి తగ్గించింది.  దానితో పాటు రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగా భారత్‌పై విధించిన అదనపు 25 శాతం ప్రతీకార సుంకాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. దీనికి సంబంధించి ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసినట్లు వైట్ హౌస్ ప్రకటిస్తూ భారత్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రష్యా చమురు దిగుమతులను నిలిపివేస్తామని అంగీకరించిందని, అలాగే అమెరికా ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిందని వెల్లడించింది.
 
ఈ ఒప్పందం ప్రకారం అమెరికా నుంచి దిగుమతి అయ్యే పలు పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు వ్యవసాయ, ఆహార వస్తువులపై భారత్ సుంకాలను తగ్గించడం లేదా పూర్తిగా తొలగించనుంది.  ఇందులో డ్రైడ్ డిస్టిలర్స్ గ్రెయిన్స్, పశువుల దాణా కోసం ఉపయోగించే ఎర్ర జొన్నలు, నట్స్, పండ్లు, సోయాబీన్ నూనె, వైన్, స్పిరిట్స్ వంటివి ఉన్నాయి. అదే సమయంలో భారత్ నుంచి ఎగుమతి అయ్యే టెక్స్‌టైల్స్, దుస్తులు, లెదర్, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు, ఆర్గానిక్ కెమికల్స్, గృహాలంకరణ వస్తువులు, చేతివృత్తి ఉత్పత్తులపై అమెరికా 18 శాతం సుంకాన్ని వర్తింపజేస్తుంది.
 
సుంకాలతో పాటు వాణిజ్యానికి అడ్డంకిగా ఉన్న నాన్-టారిఫ్ బ్యారియర్స్ (సుంకేతర అవరోధాలు)ను కూడా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ముఖ్యంగా అమెరికా వైద్య పరికరాలకు భారత మార్కెట్‌లో ప్రవేశాన్ని సులభతరం చేయడంతో పాటు యూఎస్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వస్తువులపై ఉన్న దిగుమతి లైసెన్సింగ్ నిబంధనలను భారత్ రద్దు చేయనుంది. 
 
ఈ ఒప్పందంలో మరో ముఖ్యమైన అంశం రాబోయే ఐదేళ్లలో భారత్ అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయనుంది. ఇందులో ఇంధనం, విమానాలు, వాటి విడిభాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు వంటివి ఉంటాయి. ఈ మధ్యంతర ఒప్పందం పూర్తిస్థాయిలో అమలైతే, భారత జనరిక్ మందులు, వజ్రాలు, విమాన భాగాలపై ఉన్న సుంకాలను కూడా అమెరికా ఎత్తివేయనుంది. 
 
పూర్తిస్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కోసం చర్చలు కొనసాగిస్తామని, భవిష్యత్తులో మరిన్ని సుంకాల తగ్గింపును పరిశీలిస్తామని ఇరు దేశాలు ప్రకటించాయి. జాతీయ భద్రతా కారణాలతో స్టీల్, అల్యూమినియంపై విధించిన పాత ఆంక్షల నుంచి భారత విమాన విడిభాగాలకు మినహాయింపు లభిస్తుంది. ఆటోమొబైల్ విడిభాగాల ఎగుమతిలో భారత్‌కు ప్రత్యేక కోటా దక్కనుంది. వీటితో పాటు, ఫార్మాస్యూటికల్స్, వాటి ముడి పదార్థాలపై భారత్ ప్రత్యేక రాయితీలను అందుకోనుంది.
 
డిజిటల్ వాణిజ్యానికి ఆటంకంగా ఉన్న వివక్షాపూరితమైన లేదా భారమైన అడ్డంకులను పరిష్కరించుకోవడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి. అలాగే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో భాగంగా పటిష్టమైన, ప్రతిష్టాత్మకమైన, పరస్పర ప్రయోజనకరమైన డిజిటల్ వాణిజ్య నిబంధనలను రూపొందించుకోవడానికి ఒక స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించుకున్నాయి.
 
ఈ ఒప్పందం భారత్‌-అమెరికా మధ్య, బలమైన భాగస్వామ్యం, పెరుగుతున్న విశ్వాసం, చైతన్యాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి వ్యక్తిగతంగా కృషిచేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు.
 
కాగా, రష్యా చమురు దిగుమతికి సంబంధించి సమ్మతి విషయంలో భారత్ను అమెరికా పర్యవేక్షిస్తూనే ఉంటుందని వైట్ హౌస్ తెలిపింది. భారత్ మళ్లీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రష్యా చమురు కొనుగోళ్లకు వెళ్లితే, ఈ అదనపు సుంకాన్ని తిరిగి విధించే అవకాశం ఉందని వైట్హౌస్ స్పష్టం చేసింది. అయితే, భారత్ తన అన్ని దిగుమతి సుంకాలను సున్నాకు తగ్గించేందుకు అంగీకరించలేనది యూఎస్ మాజీ వాణిజ్య సహాయ కార్యదర్శి రేమండ్ విక్కరీ పేర్కొన్నారు.