మైనారిటీ గురుకులాల్లో మతమార్పిడిలను ప్రోత్సహించే అడ్మిషన్లు

మైనారిటీ గురుకులాల్లో మతమార్పిడిలను ప్రోత్సహించే అడ్మిషన్లు
మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల కోసం రూపొందించిన నియమాల్లో కొన్ని రాజ్యాంగ విరుద్ధంగా, అక్రమ మతమార్పిడిలను ప్రోత్సహించేవిధంగా ఉన్నాయని అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ (ఎబివిపి) రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఆరోపించారు. ఈ విషయమై మైనారిటీ గురుకులాల సెక్రెటరీ సైఫుల్లాను కలిసి వినతి పత్రం అందజేశారు. 
 
ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ మైనారిటీ గురుకులాల అడ్మినిస్ట్రేషన్ చాలా గందరగోళంగా ఉందని, మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల కోసం రూపొందించిన నియమాల్లో మైనారిటీ కోటా కింద సీటు పొందే విద్యార్థులు చర్చ్ జారీ చేసే బాప్టిజం సర్టిఫికెట్ సమర్పించాలనడం రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఒక రకంగా చెప్పాలంటే అక్రమ మతమార్పిడిలను ప్రోత్సహించడమే అని స్పష్టం చేశారు. 
ఒక వ్యక్తికి సంబంధించి మత మార్పిడిని ధ్రువీకరించడం అనేది సంబంధిత ప్రభుత్వ అధికారులు నిర్ధారించి ధృవీకరిస్తారు తప్పితే ఆ అధికారం చర్చ్ లకు లేదని ఆయన తేల్చి చెప్పా రు. అడ్మిషన్ నియమాల్లోని పాయింట్ నెంబర్.2 లోని సబ్ పాయింట్. హెచ్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఆయన తెలిపారు.  వెంటనే ఈ వివాదాస్పద నియమాలను తొలగించాలని రాంబాబు డిమాండ్ చేశారు.
అయితే, మైనారిటీ గురుకులాల సెక్రెటరీ వింతగా వ్యవహరిస్తున్నారని, గతంలో కూడా ప్రార్థన సమయంలో ప్రతి విద్యార్థి ఖురాన్ చదవాలని ఒక వివాదాస్పద సర్క్యులర్ జారీ చేశారని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.  మైనారిటీ గురుకులాల్లో కేవలం ముస్లిం మైనార్టీలు మాత్రమే లేరని మిగతా మైనారిటీ విద్యార్థులతో పాటుగా హిందువులు కూడా ఉంటారని ఎబివిపి  చేసిన పోరాట ఫలితంగా ఆ సర్క్యులర్ ను ఉపసంహించుకున్నారని రాంబాబు చెప్పారు.
మైనారిటీ గురుకులాలు  మత ఛాందసవాద కేంద్రాలుగా మారాయని, అక్రమ మతమార్పిడిలను ప్రోత్సహించే కేంద్రాలుగా మారాయని అంటూ ఎబివిపి నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులతో నడుస్తున్న గురుకులాల్లో ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించడం సిగ్గుచేటని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మైనారిటీ గురుకులాల సెక్రెటరీ సైఫుల్లా ను విధుల నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.