మేడారం జాతరకు అధికారిక సెలవు ప్రకటించాలి

మేడారం సమ్మక్క–సారక్క జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ అధికారిక సెలవు ప్రకటించకపోవడం గిరిజన సమాజంపై జరిగిన ఘోరమైన అవమానం, అన్యాయం అని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రవి నాయక్ నేనావత్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతి గడించిన మేడారం సమ్మక్క–సారక్క జాతర గిరిజనుల ఆత్మ, ఆరాధన, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఆయన తెలిపారు. 
 
కోట్లాది మంది గిరిజనుల ఆరాధ్యదైవాలు సమ్మక్క–సారక్క. అలాంటి పవిత్రమైన మహాజాతరకు సెలవు ఇవ్వకుండా ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించడం గిరిజనుల ఆత్మగౌరవాన్ని తుంగలో తొక్కడమేనని ఆయన విమర్శించారు. ఇతర మతపరమైన ఉత్సవాలకు సెలవులు ప్రకటించే ప్రభుత్వం, దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే మేడారం జాతరకు మాత్రం సెలవు ఇవ్వకపోవడం తీవ్ర వివక్షకు నిదర్శనమని పేర్కొన్నారు. 
 
ఇది గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం లేదని స్పష్టంగా చాటిచెప్పుతోందని ఆయన ధ్వజమెత్తారు. మేడారం జాతరకు సెలవు ప్రకటించకపోవడం అంటే గిరిజన సమాజాన్ని రెండో తరగతి పౌరులుగా చూస్తున్నట్లేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, గిరిజనులపై ప్రభుత్వానికి ఉన్న అసహనం, ద్వేషభావాన్ని ప్రతిబింబిస్తోందని ఆరోపించారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని, మేడారం సమ్మక్క–సారక్క మహాజాతరకు అధికారిక సెలవు ప్రకటించాలని, గిరిజనుల విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని రవి నాయక్ నేనావత్ డిమాండ్  చేశారు.

About The Author