జిహెచ్ఎంసిలో విలీనంతో గ్రామస్థుల జీవనం అస్తవ్యస్తం

జిహెచ్ఎంసిలో విలీనంతో గ్రామస్థుల జీవనం అస్తవ్యస్తం
గ్రామ పంచాయతీలు  జిహెచ్ఎంసిలో విలీనం చేయడం వల్ల రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాల జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విలీనం అశాస్త్రీయం అని స్పష్టం చేశారు. హెచ్ఎండిఏ పరిధిలోని రైతుల సమస్యలపై మేడ్చల్ జిల్లా, దుండిగల్ సర్కిల్,  బౌరంపేట్ గ్రామంలో రైతులతో  శుక్రవారం జరిగిన సమావేశంలో వారి సమస్యలు ఆలకించి, వారి నుండి వినతి పత్రాలు స్వీకరించారు. 
 
ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ హెచ్ఎండిఏ పరిధిలో కన్జర్వేషన్/రిక్రియేషన్ తదితర జోన్ల వల్ల రైతులకు శాపంగా మారిందని, సామాన్య, సన్న, చిన్నకారు రైతులే ఎక్కువగా నష్ట పోతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. త్వరలో ముఖ్యమంత్రిని ఈ సమస్యల పై కలిసి కచ్చితమైన పరిష్కారం కోరుతానని దత్తాత్రేయ హామీ ఇచ్చారు. ప్రభుత్వం  స్పందించని పక్షంలో 50 వేల మంది రైతులతో ఉద్యమ రూపంలో  ప్రభుత్వం పై వత్తిడి తెద్దామని హెచ్చరించారు. 

రైతుల హక్కులు సాధించుకునేందుకు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపిచ్చారు.  70 ఏండ్ల నుండి పేద రైతుల  అదీనంలో ఉన్న లావాణి పట్టాలు, వారి భూములు ప్రభుత్వం లాక్కోవడం తగదన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్డు నుండి రైతులు తమ సొంత పొలంలోకి వెళ్లడానికి కూడా  దారి ఇవ్వకుండా  హెచ్ఎండి అధికారులు రైతులను అడ్డుకుంటున్నారని, ఇది దారుణం అని శ్రీ దత్తాత్రేయ గారు పేర్కొన్నారు

ఈ యొక్క సమస్యపై స్పందించి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది.ఇది అందరి సమస్య  అని, అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు సాగుదాం అని, త్వరలో ముఖ్యమంత్రి ని కలిసి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. పీసరి కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో బౌరంపేట్ మాజీ సర్పంచ్ లు డా ఎస్ మల్లారెడ్డి, అర్కల వీరేశం గౌడ్, కొమ్ము మంగమ్మ, మాజీ ఎంపీటీసీలు ఎస్ జంగారెడ్డి , రైతు నాయకులు కళ్లెం బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు