ప్రభుత్వాలు విధించే పన్నుల తాకిడికి తట్టుకోలేక పనామా, బహమాస్ వంటి ట్యాక్స్‌ఫ్రీ దేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడే సంపన్నుల గురించి వినే ఉంటారు! కానీ తొలిసారిగా ‘మా మీద అధిక పన్నులు వేయండి’ అం టూ 24 దేశాలకు చెందిన 400 మంది సూపర్ రిచ్ కుబేరులు దావో్‌సలో భేటీ అవుతున్న ప్రపంచ దేశాధినేతలకు ఒక బహిరంగ లేఖ రాశారు.
‘‘టైమ్ టు విన్.. వుయ్ మస్ట్ విన్ బ్యాక్ అవర్ ఫ్యూచర్. లీడర్స్ ఎట్ దావోస్, ట్యాక్స్ ద సూపర్ రిచ్ (గెలవాల్సిన సమయం.. మన భవిష్యత్తును తిరిగి పొందాలి. దావో్‌సలోని నాయకులారా, అత్యంత సంపన్నులపై పన్నులు విధించండి)’ అనే శీర్షికతో రాసిన లేఖపై హాలీవుడ్ నటుడు మార్క్ రఫాలో (‘హల్క్’ పాత్రధారి), అబిగెయిల్ డిస్నీ (వాల్ట్ డిస్నీ మనవరాలు) వంటివారు సంతకాలు చేశారు.
ఇది మనకు చాలా కొత్తగా అనిపించొచ్చుగానీ ‘పేట్రియాటిక్ మిలియనీర్స్ (దేశభక్త కోటీశ్వరులు అనొచ్చు!)’ పేరిట అమెరికాలోని అత్యంత ధనవంతులు చాలాకాలంగా ఈ డిమాండ్ చేస్తున్నారు. పేదలు, అత్యంత సంపన్నుల మధ్య నానాటికీ పెరిగిపోతున్న అంతరాలను తగ్గించడానికి తమలాంటివారిపై ప్రభుత్వం అధికంగా పన్నులు విధించాలన్నది వారి డిమాండ్.
అమెరికా మిలియనీర్ల స్ఫూర్తితో కెనడా, యూకేల్లోని కొందరు మిలియనీర్లు కూడా అదే పేరుతో సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా కలిసి ఇదే తరహాలో పనిచేసే ‘మిలియనీర్స్ ఫర్ హ్యుమానిటీ’, పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ స్థాయిలో కృషి చేసే ‘ఆక్స్‌ఫామ్’ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. దావో్‌సలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచీ వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, రాష్ట్రాల సీఎంలు, ఆర్థిక మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లు వస్తారు కాబట్టి సూపర్ రిచ్‌పై పన్నులు వేసేలా వారిని కోరుతూ ఈ లేఖ రాశారు.
ఐదున్నర దశాబ్దాల క్రితం దావో్‌సలో ప్రపంచ ఆర్థిక వేదిక తొలి సదస్సు జరిగినప్పుడు మానవాళి గణనీయమైన ప్రగతి అనే ఉదయకాలం ముందు నిలబడిందని, ఈ 55ఏళ్ల కాలంలో టెక్నాలజీ, వైద్యం, సమాచార ప్రసారం, ప్రపంచ వాణిజ్యం ఇలా అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించిందని లేఖలో గుర్తుచేశారు. ఈరోజు ప్రపంచ ప్రజలందరూ గతంలో ఎన్నడూలేనంతగా (టెక్నాలజీ పరంగా) అనుసంధానమై ఉన్నామని, అదే సమయంలో (ఆర్థికంగా) ఎప్పుడూ లేనంతగా విడిపోయి ఉన్నామని అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
దశాబ్దాలుగా సాగుతున్న ఆవిష్కరణల ప్రయాణం, అసమానతలు, పర్యావరణ విధ్వంసంతోపాటే జరిగిందని గుర్తుచేశారు. ప్రపంచ జనాభాలో కేవలం 1శాతంగా ఉన్న అత్యంత సంపన్నుల వద్ద మిగిలిన జనాభాలో 95శాతం మందికన్నా ఎక్కువ ధనం పోగుపడిందని, అత్యంత ధనవంతులకు, మిగతావారికి మధ్య ఉన్న ఈ తేడా రోజురోజుకూ, తరతరాలకూ పెరుగుతూపోతోందని గుర్తు చేశారు.
అపార సంపద కలిగిన గుప్పెడు మంది అపరకుబేరులు ప్రజాస్వామ్యాలను కొనుగోలుచేశారని, ప్రభుత్వాలపై ఆధిపత్యం సాధించారని, పత్రికాస్వేచ్ఛను హరించారని, టెక్నాలజీ, ఆవిష్కరణలపై పట్టు సాధించారని, పేదరికాన్ని సామాజిక అసమానతలను పెంచేశారని ఆందోళన వెలిబుచ్చారు. తమలాంటి ధనవంతులే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారంటే సమాజం ప్రమాదకరమైన అంచున నిలబడి ఉందన్న విషయంలో సందేహమూ లేదని స్పష్టం చేశారు.
‘‘మన ప్రజాస్వామ్యాలు, సమాజాలు, మన భవిష్యత్తు మనకు తిరిగి కావాలి. 2026లో మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది’’ అని పేర్కొన్నారు. అందుకు తాము సూచిస్తున్న ప్రభావంతమైన పరిష్కారం ఒక్కటేనని, అది అత్యంత సంపన్నులపై అత్యధికంగా పన్నులు వేయడమని తెలిపారు.

More Stories
ఉదయనిధిది విద్వేష ప్రసంగమే.. జాతి విధ్వంసం ప్రేరేపిస్తుంది
మంత్రుల మధ్య వాటాల పంపిణీతోనే సింగరేణి వివాదం
ఎన్డీఏలో చేరిన ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్